Priyanka Gandhi: మధ్యప్రదేశ్‌లో రంగంలోకి దిగిన ప్రియాంక.. ఎన్నికల ప్రచారం షురూ.. కర్ణాటక తరహా హామీలు..

మధ్యప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. దీనిలో భాగంగా సోమవారం ప్రియాంకా గాంధీ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పర్యటించి, ప్రచారాన్ని ప్రారంభించారు.

  • Written By:
  • Publish Date - June 13, 2023 / 04:23 PM IST

Priyanka Gandhi: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. మధ్యప్రదేశ్‌ (ఎంపీ)లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇక్కడ కూడా ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కర్ణాటకలో పార్టీని విజయపథంలో నడిపించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ.. మధ్యప్రదేశ్‌ బాధ్యతల్ని కూడా తీసుకున్నారు. కర్ణాటకలో అమలు చేసిన ఫార్ములానే ఇక్కడ కూడా అమలు చేయబోతున్నారు ప్రియాంకా గాంధీ. ఇప్పటికే మధ్యప్రదేశ్‌ ప్రజలకు వరాలజల్లు కురిపించింది.
మధ్యప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. దీనిలో భాగంగా సోమవారం ప్రియాంకా గాంధీ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పర్యటించి, ప్రచారాన్ని ప్రారంభించారు. కర్ణాటక తరహాలోనే భారీ హామీలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రూ.500కే ఎల్పీజీ సిలిండర్, 100 యూనిట్లు ఉచిత విద్యుత్, సగం ధరకే 200 యూనిట్ల వరకు కరెంట్, రైతుల రుణమాఫీ, సీపీఎస్ రద్దు, పాత పింఛన్ అమలు పథకాల్ని ప్రియాంక ప్రకటించారు. నర్మదా నది తీరాన ప్రకటన చేస్తున్నామని, తాము అబద్ధాలు చెప్పబోమన్నారు. బీజేపీ వాళ్లు కూడా హామీలిస్తారని, కానీ, వాటిని నెరవేర్చరన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ప్రజలు బీజేపీ హామీల్ని నమ్మలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలను చూస్తే తమ పాలన గురించి అర్థమవుతుందన్నారు. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ నర్మదా నదికి పూజలు చేశారు. నదుల్ని గౌరవించడం, పూజించడం హిందూ సంస్కృతి. నదికి పూజ చేయడం ద్వారా తాము హిందూత్వ అంశాన్ని కూడా గౌరవిస్తామని కాంగ్రెస్ ప్రజలకు చెప్పినట్లైంది.
ప్రచార బాధ్యతలు ప్రియాంక చేతికే..?
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో విజయం సాధించడంలో ప్రియాంకా గాంధీ పాత్ర కీలకం. అందుకే రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథి బాధ్యతల్ని ప్రియాంకకు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించింది. దీంతో పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌కు ప్రియాంక ప్రచారం నిర్వహించనున్నారు. దీనికోసం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని కూడా ఆమె నిర్ణయించుకుంది. ఈ ఏడాది మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. వీటిలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం నిలుపుకోవడంతోపాటు, మిగతా రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది.