BRS MLA TICKETS: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టిక్కెట్ల విషయంలో ఉత్కంఠ నెలకొంది. కొద్ది రోజుల క్రితం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు అని చెప్పినప్పటికీ, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కావడం లేదు. పరిస్థితులు అనుకూలంగా లేని చోట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో సందేహాలు తలెత్తుత్తున్నాయి. కొన్ని రిజర్వుడ్ స్థానాలతోపాటు, ఇంకొన్ని జనరల్ స్థానాల్లోనూ కొందరు సిట్టింగులకు టిక్కెట్లు ఇవ్వకూడదనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది.
పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలు, విమర్శలు ఎదుర్కొంటున్న వారికి ఈసారి టిక్కెట్లు రావడం డౌటే. అయితే, ఆ విషయాన్ని పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేలకు నేరుగా చెప్పడం లేదు. దీంతో కొందరు ఎమ్మెల్యేల్లో తమకు టిక్కెట్ వస్తుందో, రాదో అనే ఉత్కంఠ నెలకొంది. వచ్చే అక్టోబర్ లేదా నవంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోపే 70 నుంచి 80 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించాలనుకుంది బీఆర్ఎస్. ఇప్పటికే దీనికి సంబంధించిన జాబితా దాదాపు ఖరారైంది. అయితే, జాబితాను ఇంకా ప్రకటించలేదు. ముందుగా జాబితా ప్రకటిస్తే టిక్కెట్లు రాని అభ్యర్థులు తిరుగుబాటు చేయొచ్చు. ఇతర పార్టీల్లో చేరడం, రెబల్స్‌గా పోటీ చేయడం జరుగుతుంది. దీనివల్ల పార్టీకి నష్టం. అందుకే అధిక మాసం పేరుతో ఈ నెలలో జాబితా విడుదల చేయడం లేదు. అయితే, టిక్కెట్ విషయంలో డౌట్లు ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం ఈ అంశంలో పరేషాన్ అవుతున్నారు.
తమకు టిక్కెట్ ఇస్తారా.. ఇవ్వరా.. ఇవ్వకపోతే ఏం చేయాలి అంటూ అనుమానాలతో సతమతమవుతున్నారు. మరోవైపు తమకు తెలిసిన టీఆర్ఎస్ పెద్దలను ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్‌లో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు, కేసీఆర్, కేటీఆర్‌కు దగ్గరగా ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులను ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. అసలు సీఎం కేసీఆర్ ఆ జాబితా రూపొందించారా.. అందులో తమ పేరుందా.. కేసీఆర్ ఫాం హౌజ్‌లో ఉన్నారా.. ప్రగతి భవన్‌లో ఉన్నారా.. తమ గురించి సర్వేలో ఏం తేలింది.. వంటి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోనే కాదు.. గతంలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్లు, ఎమ్మెల్సీలు, మాజీలు, సీట్లు ఆశిస్తున్న వారి అందరి పరిస్థితి ఇదే. కొన్ని చోట్ల సిట్టింగులకు టిక్కెట్ రావడం లేదని తెలిసిన ఇతర అభ్యర్థులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తమకే టిక్కెట్ వస్తుందేమోననే ఆశతో ఉన్నారు. టిక్కెట్ దక్కించుకునేందుకు ఎవరికి తోచిన ప్రయత్నం వాళ్లు చేస్తున్నారు.
అధికార పార్టీ కాబట్టి సహజంగానే బీఆర్ఎస్‌లో టిక్కెట్లకు గట్టి పోటీ ఉంటుంది. దీంతో ఆశావహులు పెరిగిపోయారు. ఒకరికి టిక్కెట్ ఇచ్చి, మరొకరిని నిరాశపరిస్తే అది పార్టీకి నష్టం. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున, ముందుగా జాబితా ప్రకటించి ఇబ్బందులు పడేకన్నా.. ఆలస్యంగా విడుదల చేయడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే జాబితా ప్రకటనను ఆలస్యం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.