Raghunandan Rao: రఘునందన్ రావు దుబ్బాకకు గుడ్ బై చెప్పనున్నారా…?

దుబ్బాకలో ఓ వర్గం ఎప్పటి నుంచో రఘునందన్ రావును వ్యతిరేకిస్తోంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు రఘునందన్ రావును అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి రఘునందన్ రావుకు దుబ్బాక టికెట్ ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 28, 2023 / 01:23 PM IST

బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరొందారు రఘునందన్ రావు. ఎలాంటి ఆవేశానికి పోకుండా ఎదుటి వారికి ముప్పుతిప్పలు పెట్టడంలో రఘునందన్ రావు సిద్ధహస్తులు. స్వతహాగా లాయర్ అయిన రఘునందన్ రావు రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ప్రత్యర్థులను కట్టడి చేస్తుంటారు. దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన చరిష్మా మరింత పెరిగింది. బీజేపీకి మంచి ఊపు వచ్చింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్ రావు దుబ్బాక నుంచి కాకుండా మరో సీటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

టీఆర్ఎస్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు రఘునందన్ రావు. పటాన్ చెరువులో సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగింది. టీఆర్ఎస్ లో ఇమడలేక బీజేపీలో చేరిన ఆయన ఆ పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. అనుకోకుండా వచ్చిన దుబ్బాక ఉపఎన్నికలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఘనవిజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీకి దుబ్బాక ఉప ఎన్నిక బాగా ప్లస్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే దుబ్బాక బైపోల్ తర్వాతే బీజేపీ తెలంగాణలో ఎదిగేందుకు ఎంతో దోహదపడింది. దీంతో రఘునందన్ రావుకు పార్టీలో కూడా ప్రయారిటీ పెరిగింది.

అయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు, రఘునందన్ రావుకు పెద్దగా పొసిగేది కాదు. దీంతో అంటీముట్టనట్టు ఉండేవారు. బండిని తప్పించిన తర్వాత తనకు ప్రాధాన్యత దక్కుతుందని రఘునందన్ రావు ఆశించారు. ఢిల్లీ వెళ్లి తన డిమాండ్లను హైకమాండ్ ముందు ఉంచారు. అయినా అవి నెరవేరలేదు. దీంతో ఆయన కాస్త అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనట్లేదు. కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా తన రాత మారలేదని రఘునందన్ రావు ఆలోచిస్తున్నారు.

మరోవైపు దుబ్బాకలో ఓ వర్గం ఎప్పటి నుంచో రఘునందన్ రావును వ్యతిరేకిస్తోంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు రఘునందన్ రావును అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి రఘునందన్ రావుకు దుబ్బాక టికెట్ ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు. ఇస్తే తాము సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. దీన్ని పసిగట్టిన రఘునందన్ రావు.. ఈసారి దుబ్బాకలో కాకుండా పటాన్ చెరులో పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. పటాన్ చెరులోనే రఘునందన్ రాజకీయం మొదలైంది. తనకు మంచి అనుచరగణం కూడా ఉంది. పైగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు. ఈ అంశాలన్నీ తన గెలుపుకు దోహదపడతాయని రఘునందన్ రావు అంచనా వేస్తున్నారు. మరి హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.