హంటర్‌ చేతికి రఘురామ కేసు ఎవరీ ఎస్పీ దామోదర్‌

నరసాపురం మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును సీఐడీ కేసులో చిత్రహింసలకు గురిచేసి హత్య చేయడానికి యత్నించారనే ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో తాడేపల్లి ప్యాలెస్‌ బంటులుగా పేరొందిన కొందరు పోలీసు అధికారుల పాత్ర ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి.

  • Written By:
  • Publish Date - October 15, 2024 / 07:29 PM IST

నరసాపురం మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును సీఐడీ కేసులో చిత్రహింసలకు గురిచేసి హత్య చేయడానికి యత్నించారనే ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో తాడేపల్లి ప్యాలెస్‌ బంటులుగా పేరొందిన కొందరు పోలీసు అధికారుల పాత్ర ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు ఈ వ్యవహారంలో కేసు నమోదైంది. ఎంతో కీలకంగా పరిగణించే ఈ కేసు దర్యాప్తు బాధ్యతను జిల్లా ఎస్పీ దామోదర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నాటి సీఐడీ ఛీఫ్‌ పి.వి.సునీల్‌ కుమార్, ఇంటెలిజెన్స్‌ ఛీఫ్‌గా పనిచేసిన సీతారామాంజనేయులు, మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి, కేసు దర్యాప్తు అధికారి, రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ విజయ్‌పాల్, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి ఇందులో కీలక నిందితులు. వీరిలో అత్యధికులు శక్తిమంతమైన వ్యక్తులు. అప్పట్లో రఘురామకృష్ణంరాజుపై నమోదైన కేసు విచారణాధికారిగా విజయ్‌పాల్‌ వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తనపై కేసు నమోదు కావడంతో ఆయన కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కోర్టు ఉత్తర్వులతో ఇటీవల విచారణకు హాజరవుతున్నారు.

నిందితులంతా హేమాహేమీలు కావడం, దర్యాప్తు నత్తనడకన సాగుతుండటం, కీలక నిందితుడు సహకరించకపోవడం వంటి ఉదంతాలతో వీళ్లను హ్యాండిల్‌ చేయాలంటే కరెక్ట్‌ ఆఫీసర్‌ ఉండాలనే ఏపీ ప్రభుత్వం దామోదర్‌కు బాధ్యతలు అప్పగించారనే చర్చ సాగుతోంది. ఎస్పీ దామోదర్‌ కేసుల దర్యాప్తును సీరియస్‌గా పరిగణిస్తారు. రాజీ పడకుండా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. డీఎస్పీగా పనిచేసిన రోజుల నుంచి అదే తీరు. ఒంగోలులో ట్రైనీ డీఎస్పీగా వ్యవహరించిన రోజుల్లోనే జాతీయ రహదారిపై హత్యలకు పాల్పడుతున్న మున్నా ముఠాను అరెస్టు చేసిన ట్రాక్‌ రికార్డ్‌ ఆయనకు ఉంది. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో అత్యంత కీలకమైన రఘురామకృష్ణం రాజు కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ఎస్పీ దామోదర్‌ వైపు మొగ్గు చూపింది.