Khammam Jana Garjana Sabha: ఖమ్మంలో కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ.. హాజరుకానున్న రాహుల్..

తెలంగాణలో ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా భారీ బహిరంగ సభలు నిర్వహించబోతుంది. జూలై 2, ఆదివారం ఖమ్మంలోని ఎస్ఆర్ గ్రౌండ్స్‌లో, దాదాపు 150 ఎకరాల్లో భారీ సభ నిర్వహిస్తోంది. ఈ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారు.

Khammam Jana Garjana Sabha: తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. ఖమ్మంలో ఆదివారం తెలంగాణ జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ సభకు హాజరవుతున్నారు. ఈ సభ తర్వాత నుంచి మరింత దూకుడుగా వ్యవహరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. మరోవైపు పొంగులేటి, జూపల్లి ఈ సభలోనే పార్టీలో చేరబోతున్నారు.
తెలంగాణలో ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా భారీ బహిరంగ సభలు నిర్వహించబోతుంది. జూలై 2, ఆదివారం ఖమ్మంలోని ఎస్ఆర్ గ్రౌండ్స్‌లో, దాదాపు 150 ఎకరాల్లో భారీ సభ నిర్వహిస్తోంది. ఈ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ భట్టివిక్రమార్క చేపట్టిన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తైన సందర్భంతోపాటు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరిక సందర్భంగా కూడా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలోనే పొంగులేటి, జూపల్లి, వారి అనుచరులు, బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సభ జరిగే అవకాశం ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్ నేతలంతా ఈ సభకు హాజరవుతున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు పొంగులేటి, మల్లు భట్టివిక్రమార్క, జూపల్లి వర్గాలు సహా, కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్ రావు ​ఠాక్రే, మధుయాస్కి గౌడ్​ తదితరులు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సత్తా చాటనున్న నేతలు
ఈ సభ ద్వారా తమ సత్తా ఏంటో చాటేందుకు పొంగులేటి, జూపల్లి ప్రయత్నిస్తున్నారు. భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో ఆధిపత్యం కోసం పొంగులేటి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మహబూబ్ నగర్‌కు చెందిన జూపల్లి కూడా తన పరిధిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ సభలో భట్టివిక్రమార్క పాదయాత్ర ముగింపు జరగనుండగా ఆయన కూడా తన ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరికి మాత్రం ఇక్కడ సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. అక్కడ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో ఆమె ఫొటో కనిపించడం లేదు. ఖమ్మంలో తనకెంత ప్రజాబలం ఉందో చూపించేందుకు పొంగులేటి సిద్ధమయ్యారు.
క్రెడిట్ కోసం ప్రయత్నం
ఈ సభలో రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర పూర్తవడం.. రెండోది పొంగులేటి, జూపల్లి పార్టీలో చేరడం. దీంతో ఎవరికి వారు సభ తమదే అంటే తమదే అంటూ చెప్పుకొంటున్నారు. తన పాదయాత్ర ముగింపు సందర్భంగానే రాహుల్ వస్తున్నారని భట్టి చెబుతుంటే.. తమ చేరికల కోసమే వస్తున్నారని పొంగులేటి, జూపల్లి అంటున్నారు. దీంతో సభ క్రెడిట్ తీసుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. బల ప్రదర్శన చేస్తున్నారు. మరోవైపు ఖమ్మం కాంగ్రెస్‌లో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంపై రేణుకా చౌదరి వర్గీయులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇక్కడ పొంగులేటి వర్గం, రేణుక వర్గంగా కాంగ్రెస్ కుమ్ములాటలతో రగిలిపోయే అవకాశం ఉంది.
బీఆర్ఎస్‌పై పోరు
ఈ సభ నుంచి కాంగ్రెస్ తెలంగాణలో మరింత దూకుడుగా వ్యవహరించబోతుంది. ఈ సభలో రాహుల్ గాంధీ తెలంగాణకు సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్‌పై రాహుల్ విమర్శనాస్త్రాలు సంధిస్తారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణకు రాహుల్ కీలక హామీలు, పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి.అయినప్పటికీ సభను విజయవంతం చేసి తీరుతామంటున్నాయి.