No-Trust Debate: ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మంగళవారం ప్రారంభం కానుంది. పార్లమెంటులో ఈ రోజు నుంచి మొదలయ్యే ఈ చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే, మొదటి రోజు చర్చలో ప్రధాని పాల్గొనడం లేదని తెలుస్తోంది.
మణిపూర్‌లో జరుగుతున్న హింసపై ప్రధాని స్పందించాలని కోరుతూ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిగా ఏర్పడ్డ విపక్షాలు ఈ తీర్మానానికి పిలుపునిచ్చాయి. మంగళవారం నుంచి మూడు రోజులపాటు.. బుధ, గురువారాల్లో ఈ చర్చ జరుగుతుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చను దృష్టిలో ఉంచుకుని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ తీర్మానం సందర్భంగా సభలో వ్యవహరించాల్సిన తీరుపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ తీర్మానంపై బుధు, గురువారాల్లో ఓటింగ్, ప్రధాని సమాధానం ఉంటుంది.
ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం సాంకేతికంగా నెగ్గే అవకాశాలు లేవు. సభలో మోదీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు. అయితే, మణిపూర్ అంశంపై చర్చ లేవనెత్తాలని, ప్రధానితో ప్రకటన చేయించాలనే లక్ష్యంతోనే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి ముందుకొచ్చాయి. మూడు నెలలుగా మణిపూర్‌లో జరుగుతున్న హింస వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఇంకా ఆ ప్రాంతం హింసాత్మకంగానే ఉంది.
తాజాగా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జులై 20న ప్రారంభంకాగా.. అప్పటినుంచి ఈ అంశంపై సభలో రచ్చ జరుగుతోంది. ఈ సమావేశాల్లో మణిపూర్ అంశం కారణంగా సభా కార్యకలాపాలు చాలాసార్లు స్తంభించాయి. ప్రతిపక్షాలు అనేకసార్లు సభను అడ్డుకున్నాయి. దీంతో పార్లమెంటులో కొన్ని బిల్లుల్ని మాత్రమే ప్రభుత్వం ప్రవేశపెట్టగలిగింది. తాజా తీర్మానంతో ఈ అంశానికి తెరపడనుంది. సభలో ప్రధాని ఇచ్చే సమాధానాన్ని అనుసరించి ప్రతిపక్షాలు తదుపరి వ్యూహాన్ని అమలు చేస్తాయి.
ప్రతిపక్షాల డిమాండ్‌కు అనుగుణంగా మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ అంశంపై ప్రధానికి ముందు ఐదుగురు మంత్రులు సభలో చర్చలో పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున సమాధానమిస్తారు. వారి పేర్లను బీజేపీ ఎంపిక చేసింది. అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్య సింధియా, కిరెన్ రిజిజు సమాధానమిస్తారు. ప్రస్తుతం లోక్‌సభలో ఎంపీల సంఖ్య 570. ప్రభుత్వం నిలబడాలంటే 270 స్థానాలు కావాలి. ఎన్డీయేకు మద్దతిస్తున్న పార్టీలతో కలిసి ప్రస్తుతం ప్రభుత్వానికి దాదాపు 332 ఓట్లు ఉన్నాయి. ఇండియా కూటమికి 142 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రతిపక్షాలు గెలవడం లాంఛనమే.