Rahul Gandhi: బస్సు ప్రయాణాలు.. లారీ డ్రైవర్లతో ముచ్చట్లు.. జన్‌నాయక్‌గా రాహుల్ రాటుదేలుతున్నారా ?

రాజకీయ నాయకుడు కావడం ఈజీనేమో.. కానీ నాయకుడు అవడం మాత్రం కష్టం ! డబ్బులు విసిరేసో.. తాతలు, తండ్రి పేరు చెప్పుకునో లీడర్ అవుదామంటే కుదరదిక్కడ ! జనంలో ఉండాలి.. జనంతో ఉండాలి.. జనంలా ఉండాలి.. కష్టం తెలుసుకోవాలని.. ఓదార్పు ఇవ్వాలి.. భరోసా నింపాలి. అప్పుడే జనం మనసు గెలిచేది.. నిజమైన నాయకుడు అయ్యేది !

  • Written By:
  • Publish Date - May 23, 2023 / 02:18 PM IST

గాంధీ కుటుంబం వారసుడిగా, సోనియా గాంధీ కొడుకుగా మాత్రమే ఇన్నాళ్లు తెలిసిన రాహుల్.. ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నారు. నడక, నడత.. అడుగులతో, అడగడంతో.. తనను తాను జన్‌నాయక్‌గా.. ది లీడర్‌గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సిటీ బస్సు ఎక్కి జనాల అభిప్రాయాలు తెలుసుకున్నా.. ఇప్పుడు లారీ ఎక్కి డ్రైవర్ల కష్టాలు విన్నా.. వారికి ధైర్యం ఇచ్చినా.. తెలుస్తోంది అదే ! హర్యానాలో ట్రక్కు ఎక్కిన రాహుల్‌.. లారీ డ్రైవర్లతో కలిసి మాట్లాడారు. వారి కష్టాలు, కన్నీళ్లు అడిగి తెలుసుకున్నారు. ఈ మార్పే రాహుల్‌కు ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. ఇప్పుడు లారీ డ్రైవర్లతో ముచ్చట్లే కాదు.. కర్ణాటక ఎన్నికల సమయంలో డెలివరీ ఏజెంట్లతో కాసేపు సరదాగా ముచ్చటించారు.

అంతకుముందు ఢిల్లీ యూనివర్సిటీలో సడెన్‌గా పర్యటించి.. విద్యార్థులతో పిచ్చాపాటి మాట్లాడారు. అంతకుముందు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో ముచ్చటించారు. తానేమీ గొప్ప కాదని.. జనాల్లో తాను ఒకడిని అని పదేపదే చెప్పుకుంటూ.. సామాన్యులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్. రాజకీయంగా గెలుపు వెనక పరిగెత్తడం అవసరం లేదు.. జనాల మనసు గెలుచుకుంటే చాలు.. విజయం అయినా.. అధికారం అయినా వెనకే పరిగెత్తుకు వస్తుందని తన అడుగులతో చెప్పకనే చెప్తున్నారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారు రాహుల్. ఈ యాత్రలో ప్రతీ అడుగు.. ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. జనాలకు చేరువయితే.. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో.. జోడో యాత్ర చెప్పకనే చెప్పింది. అందుకే యాత్ర ముగిసిన తర్వాత కూడా అదే ఫాలో అవుతున్నారు. ఎన్నికల కోసమే ఈ స్టంట్‌లు అని ఎవరైనా అనొచ్చు.. ఇలాంటి పలకరింపులు, పర్యటనలు, పరామర్శలు.. కాంగ్రెస్‌ను గెలిపించొచ్చు, గెలిపించకపోవచ్చు. కానీ జనాల మనసును రాహుల్ గెలవడం మాత్రం పక్కా. నిజానికి ఇప్పుడు రాహుల్ ఎంపీ కాదు. కోర్టు తీర్పుతోనే కేంద్రం ఆ నిర్ణయం తీసుకుందా.. బీజేపీ కుట్ర ఉందా అన్న సంగతి ఎలా ఉన్నా.. అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్‌లో కసి కనిపిస్తోంది.

ఆ కసే ప్రతీసారి విజయానికి దగ్గర చేస్తోంది. కర్ణాటకలో జరిగింది అదే.. ఇప్పుడు రాహుల్‌ అడుగులు చెప్తోంది అదే ! నీలి మబ్బు వలస వెళ్లిపోతే ఆకాశమే దిగివచ్చినట్లు.. ఇప్పుడదే చేస్తున్నారు రాహుల్‌. ఇన్నాళ్లు ఢిల్లీ నివాసం, పార్టీ ఆఫీస్‌కు మాత్రమే పరిమితం అయిన రాహుల్‌.. ఇప్పుడు జనం వైపు అడుగులు వేస్తున్నారు. కలుస్తున్నారు.. కష్టాలు తెలుసుకుంటున్నారు.. నవ్వుతున్నారు.. ఏడుస్తున్నారు.. ఏడిపిస్తున్నారు.. ఇలా మీలో ఒకడిని అనే సంకేతాన్ని జనాలకు పంపిస్తూ.. తనను తాను నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారన్నది మాత్రం క్లియర్‌.