Rahul Gandhi: రాహుల్ మాస్ లీడర్‌గా మారుతున్నారా? జనాలకు దగ్గరయ్యే యత్నం చేస్తున్న కాంగ్రెస్ నేత!

రాహుల్ ఎప్పటికప్పుడు తననుతాను మార్చుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. పరిణతితో వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పార్లమెంట్‌లో, వివిధ సభల్లో కొన్నిసార్లు ఆయన చాలా పరిపక్వతతో మాట్లాడారు. అయినప్పటికీ రాహుల్ గాంధీకి మాస్ ఇమేజ్ రాలేదు.

  • Written By:
  • Publish Date - May 24, 2023 / 12:01 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చాలా విమర్శలున్నాయి. అనేక విషయాలపై అవగాహనలేమి, అసందర్భ, వివాదాస్పద వ్యాఖ్యలు, కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం వంటి కారణాలతో పలుమార్లు నవ్వులపాలయ్యారు. ఇదే అదనుగా బీజేపీ సహా ప్రత్యర్థి పార్టీలు ఆయన ఇమేజ్ మరింత దిగజార్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇక సోషల్ మీడియాలో ఆయనపై పేలే సెటైర్లు అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియాలో ఆయనను పప్పుగా వర్ణిస్తుంటారు. అయితే, రాహుల్ ఎప్పటికప్పుడు తననుతాను మార్చుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. పరిణతితో వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పార్లమెంట్‌లో, వివిధ సభల్లో కొన్నిసార్లు ఆయన చాలా పరిపక్వతతో మాట్లాడారు. అయినప్పటికీ రాహుల్ గాంధీకి మాస్ ఇమేజ్ రాలేదు. బలమైన కాంగ్రెస్ నేపథ్యం ఉన్నప్పటికీ పెద్ద లీడర్‌గా ఎదగలేకపోయారు. అయితే, రాహుల్ గాంధీలో ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా మాస్ లీడర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రధాని మోదీకి మాస్ ఇమేజ్ ఉంది. ఆయన నేపథ్యం కూడా దీనికి ఉపయోగపడింది. మోదీ ఎక్కడికెళ్లినా జనాల్ని ఆకట్టుకునేలా మాట్లాడుతారు. రాహుల్ గాంధీలో ఈ అంశమే లోపించింది అనేది రాజకీయి విశ్లేషకుల మాట. ఆయన పెరిగిన నేపథ్యం వల్ల కావొచ్చు.. ప్రజల పల్స్ పూర్తిగా తెలియదు. ఎందుకంటే గతంలో ఆయన జనంతో నేరుగా మమేకమైంది చాలా తక్కువ. కానీ, ఇప్పుడు తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు రాహుల్ గాంధీయే అసలైన లోపం అని విమర్శించిన వారి చేత కూడా శభాష్ అనిపించుకునేలా మారుతున్నారు. భారత్ జోడో యాత్ర ఇందుకు చాలా ఉపయోపడింది. గత ఏడాది రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌తోపాటు రాహుల్ గాంధీకి కూడా మంచి మైలేజ్ వచ్చింది. రాహుల్ ఇమేజ్ పెరిగింది. ఈ యాత్ర సందర్భంగా ఆయన వివిధ వర్గాల ప్రజలతో కలిసిపోయారు. యాత్ర పొడవునా అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. పేద, మధ్య తరగతి ప్రజల జీవన శైలిని అర్థం చేసుకున్నారు. దీంతో సామాన్యుల్లోనూ రాహుల్ గాంధీపై మంచి అభిప్రాయం కలిగింది. ప్రజలు రాహుల్‌ను తమ వాడిగా చూడటం మొదలుపెట్టారు.
ట్రక్కులో ప్రయాణం
తాజాగా రాహుల్ గాంధీ హరియాణాలోని ఒక ట్రక్కులో అంబాలా నుంచి చండీగఢ్ వరకు 50 కిలో మీటర్లు ప్రయాణించారు. సోమవారం అర్ధరాత్రి ఇలా ట్రక్కులో ప్రయాణించారు. ట్రక్కు డ్రైవర్లతోపాటు, సామాన్యుల కష్టాలు తెలుసుకునేందుకు రాహుల్ ట్రక్కులో ప్రయణించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నిన్నటి కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా బెంగళూరులో డెలివరీ బాయ్‌తో కలిసి స్కూటర్‌పై ప్రయాణించారు. అంతకుముందు పాత ఢిల్లీలోని మతియా మహల్ మార్కెట్‌, బెంగాలి మార్కెట్‌కి వెళ్లి సామాన్యుడిలా షాపింగ్ చేశారు. అలాగే అక్కడ రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్‌కు కూడా వెళ్లి ఫుడ్ టేస్ట్ చేశారు. ఇలా అనేక సందర్భాల్లో రాహుల్ సామాన్యులతో కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.

దేశ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాహుల్ ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ప్రజలతో కలిసిపోయే వ్యక్తి వారి మంచి కోసం ప్రయత్నిస్తారని పార్టీ చెబుతోంది. ఇదంతా చూస్తుంటే రాహుల్ గాంధీ మునుపటిలా లేరనే అర్థం చేసుకోవాలి. గతంలోకంటే మెరుగ్గా రాణిస్తున్నారు. దేశ సమస్యలపై నిరంతరం స్పందిస్తున్నారు. ప్రజలతో కలిసిపోతున్నారు. ఒక పరిపూర్ణ రాజకీయ నాయకుడు కావాలంటే ఏ అర్హతలు ఉండాలో వాటన్నింటినీ సాధించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. రాహుల్ ఇలాగే చేస్తూ ఉంటే ఆయన ఇమేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇది కచ్చితంగా కాంగ్రెస్ విజయాలకు దోహదం చేస్తుంది.