Rahul Gandhi: పార్లమెంట్‌కు రాహుల్.. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరిస్తూ నిర్ణయం

రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రెటరీ నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై వేసిన అనర్హత వేటును తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం ప్రకటించింది. దీంతో రాహుల్ సోమవారం తిరిగి పార్లమెంటుకు హాజరయ్యే అవకాశం ఉంది.

  • Written By:
  • Updated On - August 7, 2023 / 11:05 AM IST

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభ్యత్వం విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రెటరీ నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై వేసిన అనర్హత వేటును తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం ప్రకటించింది. దీంతో రాహుల్ సోమవారం తిరిగి పార్లమెంటుకు హాజరయ్యే అవకాశం ఉంది. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

రాహుల్‌కు జైలు శిక్ష పడటంతో ఆయనను లోక్‌సభలో అనర్హుడిగా ప్రకటిస్తూ స్పీకర్ వేటు వేశారు. దీంతో రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దైంది. అయితే, కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రాహుల్‌పై గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. జైలు శిక్ష తాత్కాలికంగా రద్దు కావడంతో ఆయనపై లోక్‌సభ సెక్రెటరీ విధించిన అనర్హత పిటిషన్ కూడా రద్దు చేయాల్సి ఉంటుంది. దీంతో లోక్‌సభ సెక్రెటరీ తాజాగా రాహుల్‌పై విధించిని నిషేధాన్ని తొలగిస్తూ.. సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 24న రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారని.. దానిపై ఇప్పుడు సుప్రీంకోర్టు కొత్త ఉత్తర్వు వచ్చి శిక్షను నిలిపివేసినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసిన నోటీసులో ఉంది. ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం నేపథ్యంలో రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభకు తిరిగి హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. 2019 ఎన్నికల సందర్భంగా మోదీ ఇంటి పేరుపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు దాఖలు చేశారు. సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆ కేసు నడిచింది. సూరత్ కోర్టు ఆయనకు జైల శిక్ష విధించింది. చివరకు సర్వోన్నత న్యాయస్థానంలో ఎట్టకేలకు ఆయన ఊరట లభించింది.

రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు. పార్లమెంట్ తాజా నిర్ణయంతో వచ్చే ఎన్నికల్లో కూడా రాహుల్ పోటీ చేస్తారు. మరోవైపు.. మణిపూర్ అంశంపై పార్లమెంటు‌లో జరిగే చర్చలో కూడా రాహుల్ పాల్గొంటారు. ఈ నెల 8 నుంచి చర్చ జరుగుతుంది. 11న ప్రధాని మోదీ దీనిపై సమాధానం ఇస్తారు. రాహుల్ తిరిగి పార్లమెంట్‌కు హాజరవుతుండటంతో ఢిల్లీలోని 10 జన్‌పథ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.