రాఖీ కట్టి.. మృత్యు ఒడిలోకి.. అచ్యుతాపురం ప్రమాదంలో కన్నీటి ఘటన..

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం.. ఏపీ ఉలిక్కిపడేలా చేసింది. అప్పటి వరకు హాయిగా వినిపించిన నవ్వులు.. రేపటి గురించి మాట్లాడుకున్న మనుషులు.. ఒక్క క్షణంలో కాలి బూడిదయ్యారు. శరీరాలు ఛిద్రమయి.. ఏ భాగం ఎవరిదో గుర్తుపట్టలేని స్థితిలో.. ఆ ప్రమాదం గురించి తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది.

  • Written By:
  • Publish Date - August 22, 2024 / 12:47 PM IST

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం.. ఏపీ ఉలిక్కిపడేలా చేసింది. అప్పటి వరకు హాయిగా వినిపించిన నవ్వులు.. రేపటి గురించి మాట్లాడుకున్న మనుషులు.. ఒక్క క్షణంలో కాలి బూడిదయ్యారు. శరీరాలు ఛిద్రమయి.. ఏ భాగం ఎవరిదో గుర్తుపట్టలేని స్థితిలో.. ఆ ప్రమాదం గురించి తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. రాఖీ కట్టిన చెల్లి లేదు.. రాఖీ కట్టించుకున్న అన్న లేడు.. అందరూ ఆ అగ్నికి బలయ్యారు. ఈ ప్రమాదానికి బలయిన హారిక పరిస్థితి.. ఇప్పుడు ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. పండగ రోజు తన అన్నలకు రాఖీ కట్టేందుకు వచ్చింది. ఉద్యోగ బాధ్యతల కారణంగా తిరిగి వెళ్లిపోయిన ఆ యువతి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఇది ఇప్పుడు ప్రతీ ఒక్కరి మనసును మెలేస్తోంది.

అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 18మంది చనిపోయారు. దాదాపు 60మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖ, అనకాపల్లి ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఫార్మా కంపెనీలో కాకినాడకు చెందిన చల్లపల్లి హారిక చనిపోయింది. హారిక తండ్రి ఐదేళ్ల క్రితం మరణించాడు. తల్లి, సోదరులు కష్టపడి ఆమెను చదివించారు. మొదటి నుంచి చదువుల్లో చురుకుగా ఉండే హారిక.. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఏడాది కింద ఎసెన్షియా ఫార్మా కంపెనీలో చేరింది. రాఖీ పండుగ సందర్భంగా కాకినాడకు వెళ్లిన హారికను.. మరో రెండు రోజులు ఉండాలని అన్నదమ్ములు కోరారు. సోదరుల మాట విని అక్కడే ఉంటే.. హారిక బతికి ఉండేదేమో. విధిని ఎవరు మారుస్తారు. యాజమాన్యం అనుమతి ఇవ్వకపోవడంతో బుధవారం ఉదయం కంపెనీకి వెళ్లి డ్యూటికి హాజరైంది. అంతలోనే మృత్యువు హారికను ప్రమాదం రూపంలో వెంటాడింది. ఒక్క రోజు ఇంట్లో ఉన్న ఈ గండం గడిచేదని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వాళ్లు పెడుతున్న కన్నీళ్లు ప్రతీ ఒక్కరి మనసులను మెలేస్తున్నాయ్.