Rapaka: నాకు పది కోట్లు ఇస్తామన్నారు.. క్రాస్‌ ఓటింగ్‌పై రాపాక సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఎమ్మెల్సీ ఓట్ల కొనుగోలు వ్యవహారంలో మరో సంచలనం జరిగింది. ఇప్పటికే తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ప్రలోభాలకు గురి చేశారని.. వైసీపీ నేత సజ్జల ఆరోపించారు. ఒక్కొక్కొరికి 10 కోట్లకు పైగా డబ్బులు ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు.

  • Written By:
  • Publish Date - March 26, 2023 / 06:30 PM IST

 

క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంతో.. నలుగురు ఎమ్మెల్యేలను వైసీసీ సస్పెండ్ చేసింది. ఆ ఎమ్మెల్యేలు తాము డబ్బు తీసుకున్నామనే ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇదే సమయంలో జనసేన నుంచి గెలిచి ప్రస్తుతం వైసీపీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన విషయాలు బయట పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీడీపీ నుంచి తనకు 10 కోట్ల ఆఫర్ వచ్చిందని ఎమ్మెల్యే రాపాక అన్నారు. మొదటి బేరం తనకే వచ్చిందని రాపాక తన మిత్రులతో షేర్ చేసుకున్నారు. ముందు తన మిత్రుడు కేఎస్ఎన్ రాజు ద్వారా సంప్రదింపులు చేశారని చెప్పుకొచ్చారు. పోలింగ్ రోజు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే.. తనకు నేరుగా ఆఫర్ ఇచ్చారని వివరించారు.

టీడీపీకి మద్దతు ఇస్తే భవిష్యత్లో మంచి పొజీషన్ ఉంటుందని హామీ ఇచ్చారని అన్నారు. వారి ఆఫర్‌ను తిరస్కరించానని.. తాను సీఎం జగన్ ను నమ్ముకున్నానని.. ఆయన నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పానని రాపాక తెలిపారు. సిగ్గు శరం వదిలేస్తే తనకు 10 కోట్లు వచ్చేవని రాపాక వివరించారు. తనకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన విషయాన్ని.. మంత్రి వేణుతో పాటు ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌తో షేర్ చేసుకున్నానని చెప్పారు. ఎమ్మెల్సీ శ్రీదేవి గురించి.. ముందు నుంచే పార్టీ సందేహంతో ఉందని రాపాక చెప్పారు. రాపాక కామెంట్లను టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. రాపాక చెప్పేదంతా అబద్దం అంటోంది. ఆయనకు అంత సీన్ లేదని కొట్టిపారేస్తోంది.