ప్రముఖ వ్యాపార దిగ్గజం, గొప్ప మానవతా వాది రతన్ టాటా ఇక లేరన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను కంట తడి పెట్టించింది. టాటా కంపెనీని ప్రతీ ఒక్కరికి చేరువ చేయడంలో రతన్ టాటా విజయం సాధించారు. దాత్రుత్వంలో కూడా రతన్ టాటాది పెద్ద చేయి. తన సంపాదన నలుగురికి పంచాలి అనుకోవడంలో టాటా వెనకడుగు వేయరు. అలాంటి రతన్ టాటా వివాహం చేసుకోకుండా మిగిలిపోయారు. ఆజన్మాంతం బ్రహ్మచారిగానే బ్రతికారు ఆయన. అలా అని ఆయన ఎవరిని ప్రేమించలేదా అంటే… ఆయనకు కూడా ఓ రెండు లవ్ స్టోరీస్ ఉన్నాయి.
వ్యాపార దిగ్గజంగా ఎన్నో విజయాలు సాధించిన ప్రేమలో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యారు. 1962లో భారత్, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా మొదటి బ్రేకప్ ఎదుర్కొన్నారు. యుద్దానికి, ఆయన ప్రేమ కథకు సంబంధం ఏంటీ అంటే… రతన్ టాటా ప్రేమ విఫలం కావడం వెనుక బలమైన కారణమే ఉంది. రతన్ టాటా 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు అమెరికాలో చదువు పూర్తి చేసుకుని అక్కడే లాస్ ఏంజెల్స్ లో ఓ ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. అదే సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించారు.
అప్పటికి టాటా కంపెనీలో ఆయన బాధ్యతలు చేపట్టలేదు. ఆ అమ్మాయిని వివాహం చేసుకుని అక్కడే స్థిరపడాలి అనేది రతన్ టాటా కోరిక. కాని నానమ్మ అనారోగ్యం టాటాను భారత్ కు రప్పించింది. అదే టైం లో 7 ఏళ్ళ నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న నానమ్మను చూసేందుకు రతన్ టాటా ఇండియా వచ్చారు. తనతో పాటు ఆ అమ్మాయి కూడా ఇండియా వస్తుందని టాటా భావించారు. కాని అదే సమయంలో భారత్- చైనా యుద్ధంతో తీవ్ర స్థాయిలో జరగడంతో ఆమె ఇండియా రావడం కష్టం అయింది.
ఆ అమ్మాయి తల్లి తండ్రులు ఆమెను యుద్ధం కారణంగా భారత్ వద్దని అడ్డుకున్నారు. ఇక ఆ తర్వాత రతన్ టాటా ఆమెను కలవలేదు. ఈ ప్రేమ కథ గురించి పలుమార్లు రతన్ టాటా బయట పెట్టారు కూడా. కాని ఆమె ఎవరు ఏంటీ అనేది మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. ఇక మరోసారి బాలీవుడ్ హీరోయిన్ తో కూడా రతన్ టాటా ప్రేమలో పడ్డారు. 1970ల్లో బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న సిమీ గరేవాల్ తో టాటా ప్రేమలో పడ్డారు. అప్పుడు వారు వివాహం చేసుకుంటారు అని అంతర్జాతీయ మీడియా కూడా కథనాలు రాసింది. పెళ్లి వరకు వెళ్ళకుండానే ఆమె మరొకరికి దగ్గర కావడం వివాహం చేసుకోవడం జరిగాయి. ఇలా నాలుగు సందర్భాల్లో ఆయన పెళ్లి చేసుకునే అవకాశం వచ్చినా చివర్లో చేజారిపోయింది. ఇలా రతన్ టాటా వ్యాపారంలో విజయాలు సాధించినా… వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరిగానే మిగిలిపోయారు.