రతన్ టాటా…వ్యాపార సామ్రాజ్యంలో రారాజు వెలిగాడు. నష్టాలు వచ్చినపుడు కుంగిపోలేదు…లాభాలు వచ్చినపుడు పొంగిపోలేదు. లక్షల కోట్లు డబ్బున్నా…సగటు మనిషిగానే జీవించాడు. దాతృత్వంలో మహారాజు. ఏం చేసినా తన మార్క్ చూపించాడు. కార్లంటే ఎక్కువగా ఇష్టపడే రతన్ టాటా…69 ఏళ్ల వయసులో ఫైటర్ జెట్‌ను నడిపించాడు. ఆయన ప్రవేశించని రంగమంటూ ఏదీ లేదు. భారతదేశ చరిత్రలో కొన్ని పేజీలు…ఆయన కోసం ప్రత్యేకంగా ఉంటాయి.
1961లో తొలిసారిగా జెమ్‌షెడ్‌పూర్‌లోని టాటాస్టీల్ లో సూపర్ వైజర్ గా విధులు నిర్వహించారు. వేలాది మంది ఉద్యోగులతో కలిసి నిప్పుల కొలిమి దగ్గర పనిచేశారు. అలా 1962లో అట్టడుగు స్థాయి నుంచి మొదలైన ఆయన ఉద్యోగ జీవితం తొమ్మిదేళ్లపాటు రకరకాల పనులతో అక్కడే కొనసాగింది. కెరీర్ ప్రారంభంలో అనుభవం లేని కారణంగా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. 1991లో టాటా సన్స్‌కు చెందిన జేఆర్డీ టాటా చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. రతన్ టాటా ఆయన వారసుడిగా బాధ్యతల స్వీకరణతో ప్రయాణం మొదలైంది. కెరీర్ ప్రారంభంలో అనుభవం లేని కారణంగా విమర్శలూ ఎదుర్కొన్నారు. 65 శాతం ఆదాయాలు విదేశాల నుంచి వచ్చే విధంగా నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ గ్రూపు ఆదాయాలు 40 రెట్లు పెరిగాయి. రానురానూ కంపెనీ లాభాలు 50 రెట్లు పెరిగాయి. వ్యాపారాన్ని ప్రపంచీకరణ చేసే లక్ష్యంతో టాటా గ్రూప్ రతన్ టాటా నాయకత్వంలో అనేక వ్యూహాత్మక కొనుగోళ్లు చేసింది. ఇందులో లండన్‌కు చెందిన టెట్లీ టీని 431.3 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
1868లో స్థాపించిన టాటా గ్రూప్ భారత ప్రఖ్యాత మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఆటోమోటివ్, స్టీల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ వంటి అనేక రంగాల్లో సేవలను అందిస్తోంది. 1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌కు రతన్ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు రతన్ టాటా. ఆ తర్వాత అక్టోబరు 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా కొనసాగారు. బిజినెస్ టైకూన్‌గా పిలిచే రతన్ టాటా.. టాటా గ్రూప్‌ను రెండు దశాబ్దాల్లో హైరేంజ్ కు తీసుకెళ్లారు. 1991లో జేఆర్‌డీ టాటా నుంచి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. యువ ప్రతిభను ఎంతో ప్రోత్సహించారు. వ్యాపారంపై పూర్తి నియంత్రణ సాధించే విధంగా చర్యలు చేపట్టారు. ఇక టాటా కంపెనీ ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదగడంలో ఆయన కృషి అసమాన్యమైనది. 2000లో బ్రిటిష్ కంపెనీ టెట్లీని కొనుగోలు చేసిన ఆయన.. 2007లో కోరస్ స్టీల్, 2008లో ప్రముఖ లగ్జరీ కార్ల వాహన కంపెనీ జాగ్వార్, ల్యాండ్ రోవర్‌ను సంస్థలో భాగం చేసి బహుళజాతి కంపెనీగా మార్చారు.
గుండు సూది నుంచి విమానం దాకా…ఉప్పు నుంచి ఉక్కు వరకు టాటాలు ప్రవేశించని రంగమే లేదు. ఏ వ్యాపారమైనా నాణ్యతే, నమ్మకమే లక్ష్యంగా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచంలోనే దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్.. తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. తీసుకునే నిర్ణయాలు స్వల్పకాలిక లాభాల కంటే సంస్థకు, సమాజానికి దీర్ఘకాలిక శ్రేయస్సుకు ఉపయోగపడేలా ఉండేవి. అందుకే వ్యాపారవేత్తల్లో ఆయన ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. వ్యాపారాలను నిర్వహించడంలోనే కాదు.. దాతృత్వంలోనూ ఎప్పుడూ ముందుంటారు. 1998లో కార్ల మార్కెట్‌లోకి రావాలని నిర్ణయించుకున్నారు. టాటా ఇండికా పేరుతో తన మొదటి కారు మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ కారును కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. 1999లో మొత్తం కంపెనీని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఫోర్డ్ మోటార్స్‌ను ఆయన సంప్రదించారు. కానీ, రతన్ టాటాను ఆ ఫోర్డ్ యజమాని అవమానించారు. అంత పెద్ద వ్యాపారవేత్తకు ఎంతో సమస్యాత్మకమైన పరిస్థితి ఎదురైంది. ప్యాసింజర్ కార్ల గురించి ఏమీ తెలియనప్పుడు.. వ్యాపారం ఎందుకు ప్రారంభించారంటూ ఫోర్డ్ రతన్ టాటాను అవమానించింది. 2008లో జాగ్వార్-ల్యాండ్ రోవర్ యూనిట్‌ను కొనుగోలు చేయడంతో ఫోర్డ్‌ను దివాలా నుంచి రక్షించారు.
టాటా నానో కారు రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్. సామాన్యులకు కారుని అందుబాటు ధరలో ఉంచాలని ఈ ప్రాజెక్ట్ ని చేపట్టారు. 2015లో రతన్ టాటా టాటా నానో కారును ప్రవేశపెట్టారు. రతన్ టాటా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ను స్థాపించారు. రతన్ టాటా సంపాదించిన లాభాలలో దాదాపు 60 నుంచి 65శాతం దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా అందించారు. రతన్ టాటాకు భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం, పద్మ విభూషణ్, మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ లభించాయి.
రతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి, అలనాటి బాలీవుడ్ హీరోయిన్ సిమి గరేవాల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. రతన్ టాటా మృతికి నటి సిమి గరెవాల్ సంతాపం తెలిపారు. ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా అంటూ ట్వీట్ చేశారు. రతన్ టాటాతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. టాటా గ్రూప్ వారసుడిగా అత్యున్నత గౌరవాన్ని పొందారు. రతన్ టాటా సక్సెస్ స్టోరీ యువతరాలకు అత్యంత స్ఫూర్తిదాయకం. రతన్ టాటా వ్యాపారాలను నడిపించే తీరు ఎంతో మందికి ఆదర్శం.