బాలాపూర్ లడ్డు కి రియల్ ఎస్టేట్ దెబ్బ

హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం రోజు అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది బాలాపూర్ లడ్డు ఈ ఏడాది వేలంలో ఎంత రేటు పలుకుతుంది అన్నదే.హైదరాబాద్ గ్రోత్ ని బాలాపూర్ లడ్డు వేలం రూపంలో చూస్తారు జనం. అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు మూడు లక్షల రూపాయలు మాత్రమే ఎక్కువగా వెళ్ళింది.

  • Written By:
  • Publish Date - September 18, 2024 / 03:19 PM IST

హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం రోజు అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది బాలాపూర్ లడ్డు ఈ ఏడాది వేలంలో ఎంత రేటు పలుకుతుంది అన్నదే.హైదరాబాద్ గ్రోత్ ని బాలాపూర్ లడ్డు వేలం రూపంలో చూస్తారు జనం. అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు మూడు లక్షల రూపాయలు మాత్రమే ఎక్కువగా వెళ్ళింది. కిందటి సంవత్సరం 27 లక్షల రూపాయలకు పలికిన బాలాపూర్ లడ్డు… ఈ ఏడాది మూడు లక్షల పదివేల రూపాయలు కు వెళ్ళింది. అంటే కిందటి ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మూడు లక్షల పదివేలు రూపాయలు అదనంగా వెళ్లినట్లు.

కానీ గడచిన పదేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోవడమే. అంతేకాదు ఈసారి ఆరుగురు మాత్రమే వేలంపాటలో పాల్గొన్నారు. ఈ ఏడాది వేలంపాట కిందటేడు కన్నా తక్కువకు పడిపోతుందనే భయంతో, మినిమం ఆక్షన్ 27 లక్షలకు పెట్టారు. అంటే వేలంలో పాల్గొనే వాళ్లు 27 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఆక్షన్ లో పాల్గొనాలి. దీంతో బాలాపూర్ లడ్డు వేలంపాటకు కేవలం ఆరుగురు మాత్రమే వచ్చారు. మొదట్లో అవసరం అయితే 35 లక్షల వరకు వెళ్తామని , లడ్డు దక్కించుకుంటామని కొందరు ప్రగల్బాలు పలికినప్పటికీ అక్కడ వాస్తవ పరిస్థితి అలా లేదు.

అంతేకాదు ఈసారి వేలం 30 లక్షల రూపాయలు దాటకుండా కూడా జాగ్రత్త పడ్డారు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ. అందుకోసం ముందుగానే స్థానికులకు లడ్డు దక్కేటట్లుగా వేలాన్ని 30 లక్షల రూపాయలకు స్థిరీకరించాలని అంతర్గతంగా ఒక అండర్స్టాండింగ్ తో లడ్డు వేలం వేశారు. ఇలా ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతే తర్వాత కష్టమవుతుందని, అందుకే లిమిటెడ్ హైక్ తో వేలం ని కంట్రోల్ చేయాలని స్థానిక పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే ఏడాది కూడా రియల్ ఎస్టేట్ బాగుండకపోవచ్చు. ఇప్పుడే లడ్డు వేలంనీ 35 లక్షల రూపాయల కు తీసుకొని వెళ్తే, వచ్చే ఏడాది 40 లక్షలకు పాడాల్సి ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. ఒకవేళ వచ్చే ఏడు
భక్తులు 40 లక్షల రూపాయలకు ధర పెట్టలేకపోతే… అది బాలాపూర్ గణేష్ కి అవమానంగా ఉంటుంది. అందుకని లడ్డు వేలం ని ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ తో 30 లక్షల రూపాయలకే పరిమితం చేసినట్లు సమాచారం.

1994లో కొలను మోహన్ రెడ్డి మొట్టమొదట 450 రూపాయల కి బాలాపూర్ లడ్డూను వేలంలో గెలుచుకున్నారు. ఈ లడ్డు ఎక్కువ సార్లు కొలను కుటుంబాలకే వెళ్ళింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో లడ్డు వేలం ధర కాస్త మందగించింది. కానీ 2014 తర్వాత బాలాపూర్ లడ్డు ధూమ్ దాం రేటు పలికింది. దీనికి కారణం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో… రియల్టర్లు వందల ,వేల కోట్లు సంపాదించడమే.2014లో 9లక్షల 30 వేలు పలికిన లడ్డు 2016 నాటికి 14,65,000 వెళ్ళిపోయింది.2022 నాటికి అది 24 లక్షల 60 వేల రూపాయలకు చేరుకుంది. కిందటేడు అంటే 2023లో 27 లక్షలకు పలికింది బాలాపూర్ గణేష్ లడ్డు. కానీ హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పూర్తిగా మందగించడం, రియాల్టర్ల చేతిలో డబ్బులు గలగల లాడకపోవడంతో ఈసారి 27 లక్షలైనా పలుకుతుందా లేదా అని అందరూ భయపడ్డారు.

అయితే బాలాపూర్ గణేష్ కమిటీ ముందుగా కొలను కుటుంబ సభ్యులతో అంతర్గతంగా చర్చించి, బాలాపూర్ వినాయకుడి ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని కనీసం 30 లక్షల కైనా లడ్డు ధరను కుదించి వేలం ని సగౌరవంగా పాడాలని ఒక నిర్ణయానికి వచ్చాయి. సిటీలో రియల్ ఎస్టేట్ మట్టానికి పడిపోయిన పరిస్థితిలో అసలు ఆ రేటు కూడా రావడం కష్టమే అనుకున్నారు. కానీ బాలాపూర్ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని కొలను కుటుంబం 30 లక్షలకు లడ్డూను పాడి గ్రామ గౌరవాన్ని నిలబెట్టింది. కానీ వచ్చే ఏడాది కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇలాగే దారుణంగా ఉండవచ్చు. అప్పుడు భారీ రేటు తో వేలం పాడటం కష్టమే.