ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ ను ఓపెన్ చేసారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలను, అధికారులను గురిపెట్టి కొడుతుంది సర్కార్. గతంలో మీరు చేసిన పాపాలకు మూల్యం చెల్లించక తప్పదు అంటూ సంకేతాలు ఇచ్చేసింది. మాజీ మంత్రులను టార్గెట్ గా చేసుకున్నారు. నిన్న కారుమూరి నాగేశ్వరరావు మీద చంద్రబాబుకు మంత్రి నారాయణ ఫిర్యాదు చేసారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మరింత లోతుగా ప్రభుత్వ విచారణ మొదలుపెట్టింది. దాని గురించి కీలక పత్రాలను సర్కార్ స్వాధీనం చేసుకుంది.
ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డికి స్కెచ్ రెడీ చేసి అమలు చేస్తున్నారు. ఇక ఆయన ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పుడు మరో నేత మీద గురి పెట్టింది సర్కార్. ఆయన జోగి రమేష్. అధికారంలో ఉన్నప్పుడు నానా మాటలు మాట్లాడిన జోగి రమేష్ ఇంట్లో నేడు ఏసీబీ అధికారులు ఉదయం 5 గంటల నుంచి సోదాలు మొదలుపెట్టారు. ఆయన కుమారుడు జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే జోగి రమేష్ ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనపడుతుంది.
ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు గట్టిగానే వెతుకుతున్నారు. ఆయనను ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. చంద్రగిరికి చెందిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసి 41 ఏ నోటీసులు ఇచ్చి పంపించారు పోలీసులు. కొందరు అధికారులను సైతం గట్టిగానే గురి పెట్టారని టాక్ నడుస్తుంది. వంద సిఐలను ఒకే రోజు బదిలీ చేసి చంద్రబాబు సర్కార్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరికొందరిని బదిలీ చేయనున్నారు. ఇక టీడీపీ ఆఫీసు మీద దాడి వ్యవహారంలో కూడా కీలక అరెస్ట్ లు ఉండే సూచనలు కనపడుతున్నాయి. దీనితో ఇప్పుడు వైసీపీలో తర్వాత ఎవరు తర్వాత ఎవరు అంటూ చర్చలు ఊపందుకున్నాయి. రెడ్ బుక్ లో ఇంకెవరు ఉన్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.