హైదరాబాద్‌లో సొంతిల్లు ఉండాలి అనేది ప్రతీ ఒక్క ఉద్యోగి కల. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి జాబ్స్ చేసుకునే చాలా మంది ఇక్కడే మంచి ఇల్లు తీసుకుని సెటిల్ ఐపోవాలని చూస్తుంటారు. లోన్స్ తీసుకుని అప్పులు చేసి మరీ ఇళ్లు కొంటుంటారు. అలా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మంచి బూమ్‌లో కనిపిస్తుంది. కానీ దాదాపు నెల నుంచి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ఒక్క నెలలోనే దాదాపు 42 శాతం ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్స్ అనే సంస్థ ఓ సర్వేలో తెలిపింది.
గతేడాది ఇదే సమయానికి దాదాపు లక్షా 26 వేల ఇళ్లు అమ్ముడయ్యాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం అమ్మకాల నెంబర్ లక్షను రీచ్ అవడానికే చాలా కష్టమయ్యింది. కేవలం హైదరాబాద్‌లో మాత్రమే పరిస్థితి ఇలా ఉందా అంటే.. కాదు.. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరబాద్ తరువాత బెంగళరూలో ఇళ్ల కొనుగోళ్లు బాగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే బెగళూరులో దాదాపు 26 శాతం ఇళ్ల అమ్మకాలు తగ్గాయి. ఇక చెన్నైలో 18 శాతం, కోల్‌కతాలో 23 శాతం, పెణెలో 19 శాతం ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయి. అన్ని ప్రధాన పట్టణాల్లో కూడా కొత్తగా ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంలేదు అనేందుకు ఇదే పెద్ద ఉదాహరణ. దేశం మొత్తం మీద కేవలం ఢిల్లీ, ముంబైలో మాత్రమే ఇళ్ల కొనుగోళ్లు నిలకడగా ఉన్నాయి. మిగిలిన నగరాలతో కంపేర్ చేస్తే కొద్దో గొప్పో అక్కడ అమ్మకాలు బాగానే జరుగుతున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గడానికి హైడ్రా కూడా ఓ ముఖ్య కారణమనే టాక్ వినిపిస్తోంది. ప్రాపర్టీ అమ్మేముందు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చాలా విషయాలు చెప్తుంటారు. ఇళ్లు సేల్ చేసేందుకు కొన్ని విషయాలు దాస్తుంటారు కూడా. రియల్ ఎస్టేట్ గురించి అనుమతుల గురించి అన్నీ తెలిసినవాళ్ల సంగతి ఓకే.. కానీ ఇలాంటి విషయాల్లో పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్లు మాత్రం కొత్త ఇళ్లు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి ఎలాంటి అనుమతులు లేవని ఇళ్లు కూలుస్తారో అన్న భయంతో కొత్తగా ఇళ్లు కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. నగర శివార్లలో ఇళ్ల అమ్మకాలు తగ్గడానికి ఇది కూడా ప్రధాన కారణం. సిటీ అవుట్ కట్స్‌తో కంపేర్ చేస్తే సిటీ లోపల ఇళ్ల అమ్మకాలు కాస్త మెరుగ్గానే ఉన్నా.. గతంతో కంపేర్ చేస్తే మాత్రం అమ్మకాలు చాలా వరకూ తగ్గాయన్నది మాత్రం నిజం.