New Culture : దర్యాప్తు సంస్థలపైనే దాడులు..! కొత్త సంస్కృతికి తెరలేపుతున్న ప్రాంతీయ పార్టీలు..!!

దేశంలో రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరు సరికొత్త సంస్కృతులకు తెరలేపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రాంతీయ పార్టీలు తమదైన శైలిలో ఆటంకాలు కలిగిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - May 26, 2023 / 04:06 PM IST

కాలం మారేకొద్దీ సంస్కృతి కూడా మారిపోతోంది. కొత్త కొత్త సంస్కృతులను తెరపైకి తీసుకువస్తున్నారు… ముఖ్యంగా మన రాజకీయ నాయకులు. వాళ్లు చెప్పిందే శాసనం.. వాళ్లు రాసిందే గీత.. అన్నట్టు తయారైంది పరిస్థితి. నేతలు, పార్టీల మధ్య పోరు రాష్ట్రాలకు, దేశానికీ కూడా పాకుతోంది. దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తాయి రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు. అవసరమైతే దాన్ని వ్యతిరేకించేందుకు ఎందాకైనా వెళ్తాయి. ఇప్పుడు సీబీఐ, ఐటీ దాడులే ఇందుకు పెద్ద ఉదాహరణ.

ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ కేసులో ఇప్పుడు కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను విచారణకు రావాలని సీబీఐ ఆదేశించింది. ఆయన అరెస్టు ఖాయమనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన తల్లి అనారోగ్యానికి గురైంది. అదే సమయంలో విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు గైర్హాజరయ్యారు అవినాశ్ రెడ్డి. దీంతో సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లారు. అవినాశ్ రెడ్డిని అరెస్టు చేస్తారేమోనని భావించిన వైసీపీ వర్గాలు తల్లి చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆసుపత్రిని చుట్టుముట్టాయి. సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని హెచ్చరించాయి. దీంతో సీబీఐ అధికారులు అటువైపు వెళ్లడానికి కూడా సాహసించలేదు.

ఇక చెన్నైలో విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాల్లో ఇవాళ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంకే కార్యకర్తలు రెచ్చిపోయారు. సోదాలకు వచ్చిన ఐటీ అధికారులను అడ్డుకున్నారు. ఏకంగా అధికారులపై దాడులకు పాల్పడ్డారు. మహిళా అధికారులని కూడా చూడకుండా డీఎంకే కార్యకర్తలు చేయి చేసుకున్నారు. ఇది సంచలనం కలిగించింది.

దర్యాప్తు సంస్థలపైన కూడా దాడులకు పాల్పడే కొత్త సంస్కృతిని తీసుకొచ్చాయి ప్రాంతీయ పార్టీలు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థలు తమ రాష్ట్రాల్లోకి అడుగు పెట్టకుండా ఆదేశాలిచ్చాయి. ఒకవేళ తమ రాష్ట్రాల్లో అడుగు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తేల్చిచెప్పాయి. ఇప్పుడు ఏకంగా వారిపైనే దాడులకు పాల్పడేంత స్థాయికి దిగజారాయి. ఇది ఏపీకో, తమిళనాడుకో పరిమితం కాకపోవచ్చు. రేపు మరిన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంస్కృతి రావచ్చు. ఇందులో తప్పెవరిది అంటే చెప్పలేం.. ప్రత్యర్థులపై కక్షపూరితంగా దాడులకు పాల్పడే కేంద్రానిదీ కావచ్చు.. వాటిని చట్టపరంగా ఎదుర్కొనే దమ్ములేని ప్రాంతీయ పార్టీలదీ కావచ్చు.