అనుముల రేవంత్ రెడ్డి.. తెలంగాణలో పదేళ్ళుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ ను పవర్ లోకి తెచ్చిన ఘనత ఆయన సొంతం. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం.. సీఎల్పీ నేతగా ఎన్నికవడంతో.. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. అట్టడుగున ఉన్న పార్టీకి జీవం నింపి.. ఫైర్ రగిల్చి.. ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చేదాకా ఆయనదే కీలకపాత్ర. అందుకే రేవంత్ సేవలను గుర్తించిన అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు అనుమతి ఇచ్చింది. మాస్ లీడర్ గా.. ప్రత్యర్థి పార్టీల నేతలను ఉతికిపారేసే దూకుడు స్వభావం ఉన్న నేతల రేవంత్ రెడ్డి. ప్రత్యర్థులు రవ్వంత రెడ్డి అని పిలిచినా.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి.. కొండంత రెడ్డి అనిపించుకున్నారు. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలకు చేపట్టాకా.. అగ్రెసివ్ గా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశారు. సీఎం కేసీఆర్ ను అధికారం నుంచి దింపుతామని.. మార్పు కావాలి.. మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని జనం ఒప్పుకున్నారు.
రేవంత్ సీఎం.. భట్టి డిప్యుటీ ! కాంగ్రెస్ మంత్రులు వీళ్లేనా
మహబూబ్ నగర్ కు చెందిన రేవంత్ రెడ్డి.. గ్రాడ్యుయేట్ గా ఉన్నప్పుడే ABVP లీడర్ గా ఉన్నారు. ఉస్మానియా వర్సిటీ ఏవీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను 1992లో పెళ్ళి చేసుకున్నారు. తర్వాత 2004లో తెలుగు దేశం పార్టీలో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగారు. 2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మిడ్జిల్ స్థానం నుంచి పోటీ చేయడానికి టీడీపీ నామినేషన్ తిరస్కరించడంతో.. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. 2008లో శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2008లో మళ్ళీ టీడీపీలో చేరిన రేవంత్.. 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2014లోనూ అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై రెండోసారి గెలిచారు. టీడీపీ CLP నేతగా కూడా వ్యవహరించారు.
రేవంత్ రెడ్డి రెండు వేర్వేరు అసెంబ్లీ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్స్ తో అప్పట్లో సంచలనంగా మారారు. 2009లో ఉమ్మడి ఏపీలో ఆయన ఆస్తులు 3.6 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్ లో చూపించారు. అప్పుడు 73 లక్షల వరకూ అప్పులు ఉన్నట్టు తెలిపారు. తర్వాత 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఆస్తుల విలువ 13.12 కోట్లకు పెరిగాయి. అప్పులు 3.3 కోట్లు ఉన్నట్టు అఫిడవిట్ లో చూపించారు. అంటే ఐదేళ్ళల్లోనే రేవంత్ రెడ్డి ఆస్తులు 4 రెట్లు పెరిగాయి.
2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయించేందుకు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యారు. 2017లో టీడీపీలో నేతలతో విభేదాలతో ఆ పార్టీని వీడి రెండు నెలల తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2018లో మొదట కాంగ్రెస్ పార్టీలోని ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ లో ఒకరిగా నియమితులయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ పై కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రేవంత్. తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా AICC నియమించింది. సీనియర్లు, జూనియర్లను కలుపుకుపోయి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు.