Revanth Reddy: పార్టీలోకి రావాలని బీజేపీ నేతలకు రేవంత్ పిలుపు.. ఈటలకు కూడా ఆహ్వానం.. అసలురేవంత్‌ వ్యూహమేంటి?

కర్ణాటకలో విజయం తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అంతా కలిసి కాస్త కష్టపడితే చాలు.. గెలుపు అడ్రస్‌ వెతుక్కుంటూ రావడం ఖాయమనే ధీమాలోకి వెళ్లిపోయారు ఇక్కడి పార్టీ నేతలు.

  • Written By:
  • Publish Date - May 18, 2023 / 07:38 PM IST

ముఖ్యంగా రేవంత్‌లో అదే తీరు కనిపిస్తోంది. పార్టీని వీడినవారికి, కేసీఆర్ వ్యతిరేకులకు రేవంత్‌ ఓ పిలుపునిచ్చారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారావుతో పాటు.. ఈటలకు కూడా రేవంత్ ఆహ్వానం పంపారు. మీరు వస్తానంటే మేము వద్దంటామా.. గాంధీభవన్ గేట్లు ఎప్పుడూ ఓపెన్ ఉంటాయని పిలుపునిచ్చారు. పార్టీలోకి రావాలని అనుకుంటున్న వారి కోసం.. తాను ఓ మెట్టు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు రేవంత్‌ తెలిపారు.

పార్టీకి తాను నాయకుడిని.. మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా మాత్రమే నాయకులని.. పార్టీలో చేరాలని అనుకుంటే.. వాళ్లతో నేరుగా మాట్లాడుకోవచ్చని సూచించారు. ఇప్పటికిప్పుడు రేవంత్ ఎందుకు ఇలాంటి పిలుపునిచ్చారు. ఆయన ఆహ్వానం వెనక ఎలాంటి వ్యూహం ఉంది.. రేవంత్ గట్టిగానే ప్లాన్‌ చేశారా.. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా.. లేదంటే బూమరాంగ్ అవుతుందా ఇలా రకరకాలుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చ మొదలైంది.

హ్యాండ్‌కు హ్యాండ్‌ ఇచ్చి బీజేపీలో చేరి.. మునుగోడు నుంచి పోటీ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో ఇప్పటికే కాంగ్రెస్ టీమ్ చర్చలు జరుపుతోంది. దీనిపై రాజగోపాల్ కూడా రియాక్ట్ అయ్యారు. రేవంత్‌ నాయకత్వం మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఆయన మాటలతోనే అర్థం అయింది. ఐతే ఇది తెలిసే రేవంత్ రెడ్డి మెట్టు దిగుతానని ప్రకటించారా.. తనవల్లే చేరికలు ఆగిపోతున్నాయని గ్రహించి ఇలాంటి పిలుపునిచ్చారా అంటే.. అదీ కారణం అయ్యే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయన్నది నిపుణుల అభిప్రాయం.

అందుకే సోనియా, ఖర్గే పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనక ఇదే కారణం అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఈటలకు రేవంత్ ఆహ్వానం పంపడమే ఇప్పుడు విచిత్రంగా కనిపిస్తోంది. ఈ మధ్యే ఇద్దరి మధ్య భారీ మాటల యుద్ధం జరిగింది. కేసీఆర్‌ నుంచి 25 కోట్లు తీసుకున్నారన్న ఈటల కామెంట్లతో.. రేవంత్ కన్నీరు పెట్టుకున్నారు. హద్దులు దాటి ఈటల మీద ఘాటుగానే విమర్శలు చేశారు కూడా ! అలాంటిది ఈటలకు రేవంత్‌ ఆహ్వానం పలకడమే వింతగా ఉంది. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇదే డైలాగ్‌ను రివైండ్‌ చేసుకొని మరీ పదేపదే చూశారనకుంటా రేవంత్‌ ! ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. ఈ ఆహ్వానాలు, పిలుపులు,ప్రకటనలతో అర్థం అవుతోంది ఒక్కటే. అధికారం తప్ప వేరే ఆప్షన్ లేదు అనే స్థాయిలో కాంగ్రెస్ కష్టపడుతోంది.