REVANTH REDDY: తెలంగాణ ఎన్నికలు వాడివేడిగా.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాటలతో విరుచుకుపడుతుంటే.. అదే రీతిలో స్పందిస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు సవాల్ విసిరారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకొంటానన్నారు.
Harish Rao: బీజేపీ, గవర్నర్ ఒక్కటే.. మా బిల్లులు ఎందుకు ఆగినయ్..?: హరీష్ రావు
కొడంగల్, కామారెడ్డి నుంచి నామినేషన్ ఉపసంహరించుకుంటాను అంటూ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఎన్నికల్లో విద్యుత్ అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. తాము రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ చెబుతుంటే.. ఇవ్వడం లేదని కాంగ్రెస్ అంటోంది. మరోవైపు వ్యవసాయానికి మూడు గంటల కరెంటే చాలని రేవంత్ రెడ్డి అంటున్నట్లు బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో మళ్లీ విద్యుత్ సంక్షోభం తప్పదని బీఆర్ఎస్ వాదిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకట్లు ఖాయమంటూ భయపెడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలన గుర్తుకు తెచ్చుకోవాలంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ మాటల్ని రేవంత్ సహా కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. దీంతో విద్యుత్ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై కామారెడ్డి చౌరస్తాలో చర్చిద్దాం రమ్మని పిలుపునిచ్చారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఎన్నికల బరి నుంచి తప్పుకొంటానన్నారు. కొడంగల్‌లో, కామారెడ్డిలో నామినేషన్ ఉపసంహరించుకుంటానంటూ ఛాలెంజ్ విసిరారు. బుధవారం సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు టైం ఉందని, ఈ లోపు కేసీఆర్ విద్యుత్ సరఫరాకు సంబంధించిన లాగ్ బుక్‌లతో రావాలని సవాల్ విసిరారు. మరి దీనిపై కేసీఆర్ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.