REVANTH REDDY: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రగతిభవన్ కంచెల తొలగింపు.. ప్రజాదర్బార్ ఏర్పాటు.. ఇలా తన మార్క్ పాలన చూపిస్తూ దూసుకుపోతున్నారు సీఎం రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వెనక చాలా కష్టం ఉంది. రేసులో లేని హస్తం పార్టీని.. పోటీలో నిలబెట్టి అధికారం కట్టబెట్టడంలో రేవంత్ సూపర్ సక్సెస్ అయ్యారు. కలిసొచ్చిన ప్రతీ పార్టీని కలుపుకొని ముందుకు సాగారు. ఎన్నికల సమయంలో వివిధ పార్టీల మద్దతు తీసుకుంది కాంగ్రెస్.
Supreme Court: బాలికల లైంగిక వాంఛలు.. హైకోర్టు వ్యాఖ్యల్ని తప్పుబట్టిన సుప్రీం కోర్టు..
కొన్ని పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించగా.. మరికొన్ని పార్టీలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని ఒప్పించారు. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపించారు. దీనిలో భాగంగానే తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతోనూ మంతనాలు చేసి రేవంత్ ఒప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో కోదండరాంకు ఏ పదవి ఇవ్వబోతున్నారు.. ఆయనకు ఏ స్థాయిలో ప్రాధాన్యం దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఐతే ఇప్పుడిప్పుడే తన సొంత టీమ్ ఏర్పాటు చేసుకుంటున్న రేవంత్.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డిని నియమించారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి నియామకాలు కూడా పూర్తి చేశారు. ఇక కొత్త ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరాంకు కీలక పదవిని ఇచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
పరిపాలనలో కోదండరాం సలహాలు, సహకారం తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారని సమాచారం. తెలంగాణ వనరులు, విద్య, తెలంగాణకు అనుకూలమైన పరిపాలన వంటి రంగాల్లో కోదండరాంకు అపారమైన అనుభవం, పరిజ్ఞానం ఉంది. అలాంటి వ్యక్తిని సలహాదారుగా నియమిస్తే.. తనకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని రేవంత్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక అటు ఉద్యోగ నియామకాల్లో కీలకమైన టీఎస్పీఎస్సీలోనూ కోదండరామ్‌కు ప్రధాన పాత్ర కల్పించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.