మహారాష్ట్ర రాజురా నియోజకవర్గంలో బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. మీరంతా మా సోదరులు.. ఎందుకంటే మనమంతా ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానానికి చెందిన వాళ్లమే అంటూ రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒకే కుటుంబం.. మనమంతా కలికట్టుగా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో సుభాష్ బావూను గెలిపించండని కోరారు. ఛత్రపతి శివాజీ గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం.. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్, బడుగుల ఆశాజ్యోతి పూలే ఈ గడ్డపై పుట్టినవారే అని తెలిపారు.
దేశంలో ఉన్న ఆరు మహానగరాలు.. ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ లో బీజేపీకి స్థానం లేదన్న ఆయన… ముంబైలో కూడా బీజేపీకి స్థానం ఉండబోదు.. ముంబై నగరం మహావికాస్ అగాడీతో ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు. ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ గుజరాత్ గులాంలు గా మరారని ఆరోపించారు. ఇలాంటి వెన్నుపోటు దారులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు రేవంత్. ముంబైని దోచుకోవడానికే గుజరాత్ నుంచి ప్రధాని, అదానీ వస్తున్నారని మండిపడ్డారు.
రైతులు బాగుంటునే రాష్ట్రం బాగుంటుందన్న ఆయన… అందుకే మేం 25 రోజుల్లోనే 18వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని నిరూపించామన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈ వేదికగా ప్రధానికి నేను సవాల్ విసురుతున్నా… గుజరాత్ లో ఏడాదిలో 50వేల ఉద్యోగాలు ఇచ్చారా? అని నిలదీశారు. తెలంగాణలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఇప్పటి వరకు 1కోటి 10లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారని తెలిపారు.