వరంగల్ పర్యటనలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను సీఎం అయ్యానన్న రేవంత్ రెడ్డి… గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇద్దరు ఆడబిడ్డలకు మేము మంత్రి వర్గంలో చోటు కల్పించామని తెలిపారు. అదానీ, అంబానీలను తలదన్నేలా మహిళలను వ్యాపారవేత్తలను చేస్తామన్నారు. కాళోజీ కళాక్షేత్రం పదేళ్లైనా పూర్తి చేయని దద్దమ్మలు ఈ రోజు మాట్లాడుతున్నారని తెలంగాణను ప్రపంచం గుర్తిస్తే గత పాలకులు గుర్తించలేదని మండిపడ్డారు.
కాకతీయుల గొలుసుకట్టు చెరువులు ప్రపంచానికి ఆదర్శమన్నారు. ఓరుగల్లు సంస్కృతి ఎంతో గొప్పదని తెలిపారు. చారిత్రాత్మక నగరంగా వరంగల్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నం అని స్పష్టం చేసారు. వరంగల్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేవరకు నేను నిద్రపోనని రేవంత్ స్పష్టం చేసారు. అధికారులను నిద్ర పోనివ్వనన్నారు. కేసీఆర్ తాగుబోతుల సంఘం అధ్యక్షుడు అని ఎద్దేవా చేసాడు. రాష్ట్రాన్ని తాగుబోతులుగా మార్చి అధికారంలో కూర్చోవాలని అనుకున్నాడన్నారు. తెలంగాణ ప్రజలు ఏదో కోల్పోయారు అని మాట్లాడుతున్నారన్నారు.
మా ప్రజలు ఏమి కోల్పోలేదు. మీరు ఫామ్ హౌస్ లో కూర్చోండి, రోజుకో సీసా పంపిస్తా మీ నౌకరీ పోతే, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని సంచలన కామెంట్స్ చేసారు. భద్రకాళి సాక్షిగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి, చేసిన అంటూ పేర్కొన్నారు. మాట ఇస్తే తల తెగిపడ్డా వెనక్కి పోననన్నారు. అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిదని స్పష్టం చేసారు. పదేళ్లలో ఎవరికి రుణమాఫీ చేశారో అసెంబ్లీ లో చర్చ చేద్దాం, ఏ బిల్లా రంగా వస్తారో రండని సవాల్ చేసారు. 18500 కోట్ల ఆదాయం ప్రతి నెలా వస్తోందన్న ఆయన 6500 కోట్లు జీతాలు, పెన్షన్లకే పోతోందని పేర్కొన్నారు. 6వేల కోట్లు కేసీఆర్ చేసిన అప్పుకు వడ్డీలు కడుతున్నమన్నారు. 5500 కోట్ల ఆదాయం మాత్రమే మిగిలితే రుణమాఫీ చేసి ఇతర సంక్షేమ పథకాలకు వాడుతున్నామని పేర్కొన్నారు.