రైతు సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే పంట కాలం నుంచి ప్రతి రైతుకి,ప్రతి పంటకు.. పంట భీమా కల్పించనుంది. మూడు వేల కోట్ల ప్రీమియం ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
త్వరలో రుణ మాఫీ పూర్తి చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. తెలంగాణ లో మొత్తం 42 లక్షల రుణఖాతాలున్నాయని బ్యాంకులు వివరాలు అందించాయన్నారు. కుటుంబ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని, వ్యవసాయం చేసే వారికే రైతు బంధు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. పంట ఎవరైతే పండిస్తారో వారికే చేయూత ఇవ్వాలి, అదే సరైనది అని స్పష్టం చేసారు. కౌలు రైతు, భూమి ఓనర్ చర్చించుకొని ఎవరు రైతు బంధు తీసుకోవాలో వారే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసారు.