TOP STORY: టార్గెట్‌ హరీష్‌ రావు హరీష్‌.. ఫినిష్‌

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేరిట ఉన్న భూములపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ భూములపై ఎంక్వయిరీ చేయాలని డెసిషన్ తీసుకున్నట్టు తెలిలుస్తోంది.

  • Written By:
  • Publish Date - November 23, 2024 / 03:33 PM IST

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేరిట ఉన్న భూములపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ భూములపై ఎంక్వయిరీ చేయాలని డెసిషన్ తీసుకున్నట్టు తెలిలుస్తోంది. గత ప్రభుత్వంలో రంగనాయకసాగర్ ప్రాజెక్టులో భాగంగా రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటీసులు జారీ చేయగా.. ఆ భూములను అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు పేరు మీదికి మార్చుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హరీశ్‌ రావుకు ఎకరాల కొద్దీ భూములు ఎలా వచ్చాయని ప్రభుత్వం విచారణ చేయనున్నట్లు తెలిసింది. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్లుగా సమాచారం. సిద్దిపేట జిల్లా రామంచ గ్రామంలో 2018 ఆగస్టు వరకు హరీశ్‌ రావుకు గుంట భూమి కూడా లేదు. ఆ తర్వాత ఆయన పేరు మీద అక్కడ 13.12 ఎకరాల భూమి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ఎంక్వయిరీ చేపట్టనుంది. రామంచ గ్రామంలో రైతులకు నోటీసులు ఇచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేసి.. భూములు తక్కువ ధరకు అమ్ముకునేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి.

భూ రికార్డుల బదలాయింపు మొత్తం పకడ్బందీగా సాగినట్లుగా సమాచారం. రైతుల భూమి హరీశ్‌ రావు పేరు మీదికి కాకుండా రైతుల నుంచి మరొకరు కొనుగోలు చేసి.. వారి నుంచి మాజీ మంత్రి కొనుగోలు చేశారని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రామంచలో సర్వే నెంబర్ 402, 405, 406, 464లో మొత్తం 13.12 ఎకరాల భూమి హరీశ్ రావు పేరు మీద ఉందని ధరణి పాస్ బుక్కులు సైతం స్పష్టం చేస్తున్నాయని ప్రభుత్వం ప్రాథమికంగా వివరాలు సేకరించినట్లు సమాచారం. రామంచలో సుడా నర్సరీ, సుడా ట్రీ పేరుతో ఉద్యానవనాలు ఉండగా.. వాటి పక్కనే హరీశ్‌ రావుకు సంబంధించిన భూమి ఉంది. ఈ తతంగం వెనుక అప్పుడు కీలకంగా ఉన్న ఓ అధికారి పూర్తి అండదండలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. రామంచలోని 402 సర్వే నంబర్లో ధరణి రికార్డుల ప్రకారం 5.04 గుంటల భూమి ఉంది. 2.08 ఎకరాలు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించారు. మరో 3.05 ఎకరాలు హరీశ్‌ రావు పేరు మీద మారింది. 402/ఏ/ఏ/2 సర్వే నంబర్లో 1.36 ఎకరాలు కొన్నట్లుగా ఉంది. ఈ భూమిని 2019 ఫిబ్రవరి 11న కొనుగోలు చేసినట్లు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లేవని గుర్తించినట్లు సమాచారం.

406/ఏ1 సర్వే నంబర్లో మూడు గుంటలు, 406/ఇ1 లో 16 గుంటల భూమి మాజీ మంత్రి పేరు మీద ఉంది. ఈ సర్వే నంబరులో 6 ఎకరాల సేకరణకు నోటీసు ఇచ్చి 19 గుంటలు మినహాయించారు. ఈ భూమిని 2021 సెప్టెంబర్ 17న మారి ఎల్లయ్య నుంచి ఎడ్ల యాదవరెడ్డి కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2022 మే 13న హరీశ్‌ రావుకు విక్రయించాడు. 464 సర్వే నంబరులో ధరణి ప్రకారం 9.30 గుంటల భూమి ఉంది. ఇందులో 1.29 భూమి సేకరించగా.. 8.01 ఎకరాలు హరీశ్‌ రావు పేరు మీద ఉంది. ఇప్పుడు ఈ మొత్తం వివరాలన్నీ బయటకు లాగుతోంది ప్రభుత్వం.

అయితే ఇదే విషయంపై మాజీ మంత్రి హరీష్‌ రావు స్పందించారు. తాను సంపాదించుకున్న ప్రతీ రూపాయి, ప్రతీ భూమి లీగల్‌గా సంపాదించుకున్నవేనని చెప్పారు. ఒక్క అంగులం కూడా తాను అక్రమంగా సంపాదించలేదని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి విచారణ వేసినా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని డైవర్ట్‌ చేసేందుకు ఇలాంటి ఆరోపనలు చేస్తూ కాలం గడుపుతున్నారంటూ విమర్శించారు.

ప్రాజెక్ట్‌ పేరు చెప్పి హరీష్‌ రావు పెద్ద మొత్తంలో భూములు సేకరించుకున్నాడనేది ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీనికి సబంధించిన పూర్తి డేటాను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్‌ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒకపక్క ఆ వ్యవహారం జరుగుతుండగానే హరీష్‌ రావుకు కూడా చెక్‌ పెట్టే ప్లాన్‌ సిద్ధం చేసింది కాంగ్రెస్‌.