REVANTH REDDY: కర్ణాటక ఫార్ములా! కాంగ్రెస్‌ గెలిచినా రేవంత్‌ సీఎం కాలేరా?

కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం అయ్యేది రేవంతే అనే ప్రచారం ఊపందుకుంది. ఐతే కాంగ్రెస్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉండబోతున్నాయా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ అనుసరించిన విధానాలు చూస్తే.. తెలంగాణలో ఆ పార్టీ గెలిచినా, రేవంత్‌కు సీఎం పదవి కచ్చితంగా వస్తుందా అంటే.. చెప్పలేని పరిస్థితి నెలకొంది.

  • Written By:
  • Publish Date - November 15, 2023 / 04:00 PM IST

REVANTH REDDY: తెలంగాణలో కాంగ్రెస్‌ ఫుల్‌ జోష్‌లో కనిపిస్తోంది. అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేస్తోంది కూడా ! నిజానికి రాజకీయం చెప్తోంది కూడా అదే. పోటీ అంతా బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మధ్యే అన్నట్లు కనిపిస్తుండడం.. బీజేపీ ప్రభావం అంతగా లేదు అనిపిస్తుండడంతో.. హస్తం పార్టీ విజయంపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ మీద జనాల్లో వ్యతిరేకత మొదలైందని.. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడానికి కారణమైన వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేయడం, ఆరు ప్రధాన హామీలు జనాల్లోకి అద్భుతంగా వెళ్లడంతో.. ఇవన్నీ తమకు విజయాన్ని సాధించి పెడతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

REVANTH REDDY: 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకొంటా: రేవంత్ రెడ్డి

ఇక అటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌.. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్‌లో చాలామంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నా.. ఎవరూ ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలకే ఎక్కువగా పరిమితం అవుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార బాధ్యతలు.. రేవంత్ రెడ్డి పైనే పడ్డాయ్. దీంతో కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం అయ్యేది రేవంతే అనే ప్రచారం ఊపందుకుంది. ఐతే కాంగ్రెస్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉండబోతున్నాయా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ అనుసరించిన విధానాలు చూస్తే.. తెలంగాణలో ఆ పార్టీ గెలిచినా, రేవంత్‌కు సీఎం పదవి కచ్చితంగా వస్తుందా అంటే.. చెప్పలేని పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ.. రాష్ట్రమంతా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించి.. ముందుకు నడిపించిన డీకే శివకుమార్‌కు.. ముఖ్యమంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. ఐతే సీఎల్పీ లీడర్‌గా ఉన్న సిద్ధరామయ్యకి సీఎం పదవిని కట్టబెట్టి సీనియారిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామనే విషయాన్ని చెప్పకనే చెప్పింది కాంగ్రెస్ హైకమాండ్‌.

తెలంగాణలోనూ అలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత.. లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలవుతుంది. దీంతో కాంగ్రెస్ తన పార్టీకి గట్టి ఓటు బ్యాంకు ఉన్నా, బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ లెక్కన చూస్తే.. సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్కకే.. కాంగ్రెస్‌లో సీఎం ఛాన్స్ ఉండొచ్చనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. ఐతే ఇదంతా ప్రస్తుతానికి ప్రచారం మాత్రమే. ఇంకా ఎన్నికలు జరగాలి.. కాంగ్రెస్ గెలవాలి.. చాలా మ్యాటర్ ఉంది బాస్ అంటూ డిస్కషన్ మొదలుపెట్టారు సోషల్‌ మీడియా జనాలు.