REVANTH REDDY: కేసీఆర్‌ మీద రేవంత్ రివేంజ్‌ తీర్చుకుంటారా..?

ఒకప్పుడు కల్వకుర్తిలో ఎమ్మెల్యే టికెట్ నిరాకరించిన కేసిఆర్‌కు తన స్థాయి ఏంటో చూపించడానికి సుదీర్ఘ ప్రయాణం చేసిన రేవంత్.. అనుకున్న లక్ష్యాన్ని చేరగలిగారు. ఐతే ఈ ప్రయాణంలో అనేక ఒడిదుకులు ఎదుర్కొన్న రేవంత్.. ఒకానొక దశలో అయితే అష్టదిగ్బంధనం ఎదుర్కొన్నాడు.

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 04:10 PM IST

REVANTH REDDY: రేవంత్‌.. సీఎం రేవంత్ అయ్యారు. బాధ్యతలు తీసుకున్నారు. ఆరు గ్యారంటీలపై మొదటి సంతకం పెట్టేశారు. ఓ జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు.. రేవంత్‌ ప్రయాణం గుర్తుచేసుకుంటే ప్రతీ ఒక్కరికి స్ఫూర్తి రగలడం ఖాయం. అసాధ్యం అనుకున్న పనిని.. సుసాధ్యం చేసి చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా..! ప్రతీ అవమానాన్ని గుర్తుపెట్టుకొని అంతకు అంతా బదులు తీర్చేసే నేతగా రేవంత్ రెడ్డికి ఓ పేరు ఉంది. ఒకప్పుడు రాజకీయాల్లో తన స్థాయి గురించి చిన్న చూపు చూశారని.. పట్టుపట్టి మరీ ఎమ్మెల్యే అయ్యారు.

REVANTH REDDY: ఆరుగ్యారెంటీలపై సీఎం రేవంత్ తొలి సంతకం.. పాలకులం కాదు.. సేవకులమన్న సీఎం

ఒకప్పుడు కల్వకుర్తిలో ఎమ్మెల్యే టికెట్ నిరాకరించిన కేసిఆర్‌కు తన స్థాయి ఏంటో చూపించడానికి సుదీర్ఘ ప్రయాణం చేసిన రేవంత్.. అనుకున్న లక్ష్యాన్ని చేరగలిగారు. ఐతే ఈ ప్రయాణంలో అనేక ఒడిదుకులు ఎదుర్కొన్న రేవంత్.. ఒకానొక దశలో అయితే అష్టదిగ్బంధనం ఎదుర్కొన్నాడు. ఓటుకు నోటు కేసులో మీడియా సాక్షిగా పట్టు పడడంతో ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఆ టైమ్‌లో ఒక్కగానొక్క కూతురు వివాహానికి కూడా హాజరవ్వడానికి పోలీస్ పహారాతో వచ్చినప్పుడు ఆయన కళ్లల్లో కనిపించిన కన్నీటి చెమ్మ చాలామందిని కదిలించింది. నిజానికి ఆ విషయాలన్నింటిని రేవంత్ గుర్తుపెట్టుకున్నారు. చాలా ఇంటర్వ్యూలో ఆ విషయం గుర్తుచేస్తూ ఎమోషనల్ అయ్యారు కూడా ! అలాంటి రేవంత్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు.. దీంతో అంతకు అంత బదులు తీర్చుకుటారా.. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తారా అనే చర్చ సామాన్యుల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్‌ హయాంలో అడుగడుగునా అవినీతి జరిగిందని.. ప్రతీ ప్రాజెక్ట్‌లో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని ఎన్నికల ప్రచార సమయంలో పదేపదే చెప్పిన రేవంత్.. ఇప్పుడు వాటిపై విచారణకు ఆదేశిస్తారా.. కేసీఆర్‌ను జైలుకు పంపించే ధైర్యం చేస్తారా.. ఇదే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

ఐతే తాను వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్లను అని రేవంత్ అంటున్నారు. రాజకీయ జీవితంలో అనేక ఎదురుదెబ్బలు తిన్న రేవంత్‌కు.. పూర్తిస్థాయిలో తత్వం బోధపడింది. ఇప్పుడు సీఎం కావడంతో.. వ్యక్తిగత ద్వేషాలను పట్టించుకోరని కేవలం ఒక నిర్మాణాత్మక ప్రభుత్వంగా మాత్రం అసలు తప్పిదం ఎలా జరిగిందో తేల్చడానికి విచారణలు చేస్తారే తప్ప.. అందులో వ్యక్తిగత కక్ష ఉండదని మరికొందర ఎనలైజ్‌ చేస్తున్నారు. ఏమైనా రేవంత్‌ రాజకీయ ప్రయాణం కీలక దశకు చేరుకుంది. ఇకపై ఆయన ప్రయాణం ఎలా సాగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.