Revanth Reddy: కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయం మారుతుందా? రేవంత్‌కు అసలు విషయం అర్థమైందా?

రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బలపడుతోంది. అలాగని ఏ ఒక్క పార్టీయో ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ విషయం అన్ని పార్టీలకూ అర్థమైంది. ఇంకొక పార్టీ మద్దతు లేకుండా అధికారం చేపట్టే అవకాశం లేదు. ఇది అటు అధికార బీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతోంది. మరోవైపు ఇదే అంశం రేవంత్ రెడ్డిని ఇంకా ఆందోళనకు గురిచేస్తోంది.

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? రాదా? అనే అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చినట్లే కనబడుతోంది. తన అంచనాలకు తగ్గట్లుగా, తన రాజకీయ భవిష్యత్తుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ విషయంలో రేవంత్ ప్లాన్ ఏంటి? అందరూ అనుకుంటున్నట్లు బీఆర్ఎస్ పార్టీతో కలుస్తారా? లేక ఒంటరిగా వెళ్తారా? ఈ విషయంలో విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న సమాధానం ఇదే.
తెలంగాణలో ఇది ఎన్నికల సంవత్సరం. అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో అధికారం చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. అయితే, ఆ పార్టీకి ఇప్పుడేమంత పరిస్థితులు అనుకూలంగా లేవు. అనేక అంశాల్లో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. మరోవైపు గత ఎన్నికల సమయంలో బలహీనంగా ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు బలపడుతున్నాయి. బీజేపీ తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. మరోవైపు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బలపడుతోంది. అలాగని ఏ ఒక్క పార్టీయో ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ విషయం అన్ని పార్టీలకూ అర్థమైంది. ఇంకొక పార్టీ మద్దతు లేకుండా అధికారం చేపట్టే అవకాశం లేదు. ఇది అటు అధికార బీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతోంది. మరోవైపు ఇదే అంశం రేవంత్ రెడ్డిని ఇంకా ఆందోళనకు గురిచేస్తోంది.
రేవంత్‌కే అసలు సమస్య!
రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది. కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీంతో మరింతగా కాంగ్రెస్ ప్రజల్లోకి దూసుకెళ్తే, ఇంకా బలపడే అవకాశం ఉండేది. కానీ, కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు ఆ పని చేయనివ్వడం లేదు. ఒకవర్గం రేవంత్‌ను వ్యతిరేకిస్తూ, పార్టీ ఎదుగుదలను అడ్డుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ నేతల వైఖరి వల్ల సరైన మైలేజీ రావడం లేదు. నేతలు కలిసికట్టుగా పని చేయాల్సింది పోయి.. ఒకరినొకరు తిట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ విషయంలో నేతల్లో మార్పు రావడం లేదు. దీంతో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రావడం కష‌్టంగానే కనిపిస్తోంది. గతంలోకంటే మెరుగైన సీ‌ట్లు మాత్రం వస్తాయి. అధికారంలోకి రాకపోతే అందరికంటే ఎక్కువగా చిక్కుల్లో పడేది రేవంత్ రెడ్డి మాత్రమే.


బీఆర్ఎస్‌తో కలవాల్సిందేనా?
చాలా మంది అంచనా ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా? లేక ఎన్నికలయ్యాక కూటమి కడతారా? అన్నదే తేలాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ.. బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల ఈ పార్టీల కలయిక సాధ్యమే. పైగా కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారనే పేరుంది. దీంతో వీళ్లంతా ఈ కలయికకు మద్దతు తెలుపుతారు. కాంగ్రెస్ పార్టీలోని మిగతా నేతలూ దీన్ని వ్యతిరేకించకపోవచ్చు. ఎటొచ్చీ సమస్య రేవంత్ రెడ్డికే. ఎందుకంటే ఆయన మొదటి నుంచీ కేసీఆర్‌ను, ఆయన పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డిని నోటుకు ఓటు కేసులో ఇరికించింది కూడా ఆ పార్టీనే. ఈ కేసు వల్లే టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ విడిచి ఏపీ వెళ్లిపోయారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది. దీంతో మరో దారి లేక రేవంత్ కాంగ్రెస్‌లో చేరారు. కొద్ది రోజులకే టీపీసీసీ అధ్యక్షుడయ్యాడు. అప్పటి నుంచి కేసీఆర్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోతే ఇంకేమైనా ఉందా? రేవంత్ పరువేంగాను?
రేవంత్ ప్లాన్ ఏంటి?
చాలా మంది అంచనా ప్రకారం.. భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ దిశగా పరిణామాలు వేగంగా మారిపోతాయి. పైగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుంది. బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుంది. అటు కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్.. కాంగ్రెస్‌తో కలవకతప్పదు. ఈ విషయంపై ఢిల్లీ అధిష్టానం నుంచే నిర్ణయం ఉంటుంది. దీన్ని రేవంత్ వ్యతిరేకించినా ఆయన చేయగలిగిందేమీ లేదు. అందుకే ఎలాగూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కలుస్తాయి కాబట్టి.. రేవంత్ తనదారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లడంకన్నా.. ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లేందుకే ఆయన ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా ఆర్థికంగా బలపడేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.