RK ROJA: వైసీపీ నేత, మంత్రి ఆర్కే రోజాకు షాక్ తగిలింది. ఆమె భర్త, దర్శకనిర్మాత సెల్వమణిపై తమిళనాడు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సెల్వమణిపై దాఖలైన పరువు నష్టం కేసులో, ఆయన కోర్టుకు హాజరుకాలేదు. ఆయన తరఫు న్యాయవాదులు కూడా స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అసలే రోజా నియోజకవర్గమైన నగరిలో ఆమెకు పరిస్థితులు అనుకూలంగా లేని టైంలో.. ఆమె భర్తపై వారెంట్ జారీ కావడం ఆమెను మరింత షాక్‌కు గురి చేస్తోంది.
సెల్వమణిపై ముకుంద్ చంద్ బోత్రా అనే ఫైనాన్షియర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. 2016లో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సెల్వమణి మాట్లాడుతూ.. ముకుంద్ కారణంగా తాను ఇబ్బందులకు గురైనట్లు ఆరోపించారు. ముకుంద్‌పై పలు ఆరోపణలు చేశారు. సెల్వమణి వ్యాఖ్యల వల్ల తన పరువుకు భంగం కలిగిందని, ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. సెల్వమణితోపాటు అరుళ్ అనే మరో వ్యక్తిపైనా చెన్నై జార్జ్ టౌన్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు ముకుంద్. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే ముకుంద్ మరణించారు. అయినప్పటికీ.. ఆయన తనయుడు గగన్ బోత్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు ఈ కేసు విచారణ సాగింది. సోమవారం కూడా ఈ కేసు విచారణ జరిగినప్పటికీ, సెల్వమణి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం కోర్టు ఆదేశాలు అందుకున్న పోలీసులు సెల్వమణిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. అరెస్ట్ అవ్వకుండా సెల్వమణి బయటపడాలంటే ఆయన తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆయన కోర్టుకు హాజరవుతారా..? లేక న్యాయవాదితో వారెంట్ రద్దు కోసం ప్రయత్నిస్తారా..? అన్నది తెలియాలి.
మరోవైపు రోజాకు నగరి నియోజకవర్గంలో పరిస్థితులు అనుకూలంగా లేవు. రోజా ప్రత్యర్థులు ఆమెపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వైసీపీ తరఫున ఆమెకు టిక్కెట్ ఇప్పించినప్పటికీ.. ఆమెకు స్థానిక నేతలు సహకరించే పరిస్థితులు లేవు. సోమవారం నగరిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అక్కడ రోజాకు, స్థానిక నేతలకు మధ్య విబేధాలున్నాయని స్పష‌్టమైంది. ఈ నేపథ్యంలో రోజా రాజకీయ భవిష‌్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.