రోజా ఓటమి వెనక.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలు ఎంత కారణమో.. సొంత పార్టీలో లుకలుకలు కూడా అంతే కారణం అనే ప్రచారం ఉంది ఎప్పటి నుంచో. సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తుందని.. పెద్దిరెడ్డికి, రోజాకు పొసగడం లేదని.. జగన్ హయాం నుంచి వినిపిస్తోంది. ఘోర పరాభవం తర్వాత.. వైసీపీలో పోస్టుమార్టం స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్‌లో రోజా ప్రతీకారం తీరినట్లు అయింది. రోజా అనుకున్నది సాధించారు.. తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టారు.. ఏకంగా పార్టీలోనే లేకుండా చేశారు. నగరికి చెందిన వైసీపీ నేతలు కేజే కుమార్, ఆయన సతీమణి శాంతిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఈ మేరకు చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు క్రమశిక్షణ సిఫార్సు మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇక మీదట వారు ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేసినా.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని క్లియర్‌కట్‌గా చెప్పేశారు. నిజానికి నగరిలో రోజా, కేజే దంపతుల మధ్య వార్ నడుస్తోంది. ఒకే పార్టీలో ఉన్నా సరే.. వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టేవారు. రెండు వర్గాల మధ్య నగరిలో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయ్. కేజే దంపతులకు మరికొందరు లోకల్ వైసీపీ లీడర్లు కూడా మద్దతు తెలిపారు. నగరి నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీపీ ఎన్నిక విషయంలోనూ వివాదం నడిచింది.. మంత్రి రోజా తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టి.. తన వర్గానికి ఆ పదవి వచ్చేలా చేశారు.
అప్పటి నుంచి ఈ వార్ మరింత ముదిరింది. అయితే వైఎస్ జగన్ నగరి పర్యటనకు వచ్చిన సమయంలో కేజే శాంతి, రోజా చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. కేజే శాంతి తిరస్కరించగా.. జగన్ మాత్రం ఒప్పుకోలేదు.. ఇద్దరి చేతులు కలిపారు. నగరి నియోజకవర్గంలో కలిసి పనిచేయాలని సూచించారు. అయినా సరే ఆ తర్వాత కూడా రెండు వర్గాల మధ్య వివాదాలు కొనసాగాయి. ఈ ఎన్నికల్లో రోజా వ్యతిరేక వర్గం మొత్తం ఏకమైంది.. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధినేత జగన్, పార్టీ పెద్దల్ని కోరారు. ఆమెకు టికెట్ ఇస్తే నగరిలో వైసీపీ ఓడిపోతుందని చెప్పారు. దీంతో వైసీపీ అధిష్టానం నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరంతా ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పనిచేశారు. కేజే కుమార్, శాంతి వర్గం కూడా అంటీముట్టనట్లు వ్యవహరించారు. టీడీపీ అభ్యర్థి కోసం పనిచేసినట్లు ప్రచారం జరిగింది. మొత్తమ్మీద ఇప్పుడు రోజా తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టారు. అనుకున్నది సాధించారు.