బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్‌గా భావించే కవిత (Kavitha) అడ్డంగా దొరికిపోయారు. ఆమె ధరించిన వాచ్ (Watch) పై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా కథనాలు నడుస్తున్నాయి. రూ.20 లక్షల విలువైన వాచ్ (Rs.20 Lakhs Watch) ధరించడంపై ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను కష్టపడే వాచ్ కొనుక్కున్నానని కవిత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే 2018లో ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో (Interview) తనకు ఇల్లు కూడా లేదనే కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ రెండు కామెంట్స్ ను పోల్చిచూపుతూ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
2018లో కేసీఆర్ (KCR) ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సందర్భంలో కవిత ఎంపీగా ఉన్నారు. అప్పుడామె తనకు ఇల్లు కూడా లేదని, అద్దె ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. తాము అధికారంలో ఉన్నా సంపాదించుకోలేదనేలా చెప్పారు. తాజాగా ఇప్పుడు కవిత మరో చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వాచ్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారన్న ప్రశ్నకు.. గిఫ్ట్ ఏంటండి.. నేనే కొనుక్కున్నా.. అన్నారు. అంతలోనే తన భర్త అప్పుడప్పుడు గిఫ్ట్ ఇస్తుంటారని మాట మార్చారు. 20లక్షల ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చేంత సంపాదిస్తున్నారా.. అనే ప్రశ్నకు తాను డబ్బలు లేని ఇంట్లో పుట్టలేదన్నారు. తాను చేస్తున్న వ్యాపారాలు సక్సెస్ అవుతున్నాయన్నారు. అంతేకాదు.. తాను పేదరాలినని నటించడం రాదన్నారు కవిత.
కవిత వాచ్ పై బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. కవిత వాచ్ విలువ ప్రీతి (Preethi) ప్రాణానికి కూడా లేదన్నారు. వైద్య విద్యార్థిని ప్రీతి చనిపోతే 10 లక్షలు ఇచ్చారని, కవిత వాచ్ 20 లక్షల ఖరీదని చెప్పారు. అంటే ప్రీతి ప్రాణం కనీసం వాచ్ ఖరీదు కూడా చేయలేదన్నారు. నాడు ఇల్లు కూడా లేని కవిత ఇప్పుడు ఖరీదైన బంగ్లాలు, కార్లు, విల్లాలు ఎలా సంపాదించిందో చెప్తే అందరూ నేర్చుకుంటారన్నారు.
జస్ట్ ఐదేళ్లలో కవిత ఇల్లు లేని స్థాయి నుంచి 20లక్షల వాచ్ ధరించే స్థాయికి ఎదిగారు. కవిత ఏం వ్యాపారాలు చేసి ఇంతింత డబ్బులు సంపాదిస్తున్నారో చెప్తే తమ పిల్లలతో కూడా ఆ వ్యాపారాలు చేయిస్తామంటున్నారు నెటిజన్లు. మొత్తంగా ఇప్పడు కవిత వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్. వాచ్ చుట్టూనే తెలంగాణ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి.