Bandi Sanjay: క్రమ శిక్షణకు మారుపేరుగా చెప్పుకొనే బీజేపీలో కూడా అంతర్గత కలహాలు బాగానే ఉన్నాయి. తెలంగాణ బీజేపీలోనూ నేతల మధ్య పోరు బయటపడుతూనే ఉంది. కొంతకాలంగా టీబీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఇతర నేతలు అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. బండి వైఖరిపై ఈటల రాజేందర్, రఘు నందన్, ధర్మపురి అరవింద్ వంటి నేతలు అసంతృప్తితో ఉన్నారు. అనేకసార్లు వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. తాజాగా బండి సంజయ్‌కు తెలియకుండా పొంగులేటిని ఈటల రాజేందర్ కలవడం, అలాగే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో ఈటల చర్చలు జరపడం వంటివి బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు నిదర్శనం. ఇదే సమయంలో బండి ఢిల్లీ వెళ్లడం పార్టీలో మరింత హీట్ పెంచుతోంది. బండి ఢిల్లీ ఎందుకు వెళ్లారు? పార్టీలో మార్పులేమైనా జరగబోతున్నాయా? అంటూ పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.
తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇటీవలే ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఆయన ఎందుకు వెళ్లారో ఎవరికీ తెలీదు. బండిపై ఫిర్యాదు చేసేందుకే వెళ్లుంటారని ఒక ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే బండి కూడా ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని చాలా మంది బీజేపీ నేతలు బండిపై అసంతృప్తితో ఉన్నారు. ఆయనను పదవి నుంచి తొలగించాలని కొందరు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని చాలా మంది అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ, దీనికి అధిష్టానం సిద్ధంగా లేదు. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర నాయకత్వాన్ని మారిస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని పెద్దలు భావిస్తున్నారు. పైగా మోదీ, అమిత్ షాకు బండి నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉంది. ఆయన అధ్యక్షుడయ్యాకే తెలంగాణలో పార్టీకి ఊపొచ్చింది. హిందూత్వ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. అందుకే బండిని ఇప్పట్లో మార్చే అవకాశం లేదని చాలా మంది అభిప్రాయం.
పదవి కోరిన ఈటల?
ఈటల రాజేందర్ తనకు బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు పదవి ఇస్తే పార్టీలోనే అనేక సమస్యలు రావొచ్చు. ఎందుకంటే చాలా మంది నేతలు ఎన్నో ఏళ్లుగా బీజేపీని అంటిపెట్టుకుని ఉన్నారు. వాళ్లను కాదని మొన్న పార్టీలో చేరిన ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వడం సరికాదని అధిష్టానం భావిస్తోంది. ఇలాంటి దశలో బీజేపీ కీలక మార్పులకు సిద్ధంగా లేదు. బండి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు తమకు పడేలా చేయగలిగితే చాలు అనేది ఆ పార్టీ నమ్మకం. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీకి కొంతవరకు ఇబ్బందే అయినప్పటికీ, తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని అధిష్టానం అభిప్రాయం. అందుకే పార్టీలోని అంతర్గత కలహాలను చక్కదిద్ది, బండి నాయకత్వాన్ని బలపర్చి, ఎన్నికలకు వెళ్లాలని అధిష్టానం భావిస్తోంది.