తెలంగాణలో ప్రస్తుతం అందుతున్న రైతు బంధు సాయంలో మార్పులు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy govt) భావిస్తోంది. రైతు భరోసా పేరుతో వచ్చే కొత్త పథకం కోసం లేటెస్ట్ గా గైడ్ లైన్స్ రూపొందిస్తోంది. కొన్ని భూములకు రైతు బంధు సాయం చేయరాదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సాగులో ఉన్న భూములకే ప్రాధాన్యత ఇవ్వబోతోంది. దీంతో పాటు రైతు బంధు సాయంలో అనేక మార్పులు ఉండబోతున్నాయి.
రైతుబంధు (Rythu Bandhu) పేరుతో రైతులకు పంటల పెట్టుబడి సాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ప్రారంభించింది. ప్రస్తుతం ఎకరానికి 10 వేల రూపాయలుగా ఉన్న ఈ సాయాన్ని…. 15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చాలని కూడా డిసైడ్ అయింది. అందుకు సంబంధించిన కొత్త విధి విధానాలను రెడీ చేస్తోంది రేవంత్ సర్కార్. ఈసారి సాగులో ఉన్న భూములకే రైతుబంధు ఇవ్వబోతున్నారు. BRS హయాంలో రైతుల పేరిట ఏ భూమి ఉన్నా అమౌంట్ బ్యాంక్ అకౌంట్స్ లో వేశారు. అందులో వ్యవసాయానికి ఉపయోగించని రియల్ ఎస్టేట్ వెంచర్లు, రాళ్ళు, రప్పలు, గుట్టలకు కూడా రైతుబంధు సాయం అందేది. దీనిపై గతంలో కాంగ్రెస్ లీడర్లు (Congress leaders) విమర్శలు చేశారు. అందుకే ఇప్పుడా భూములకు సాయం నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రైతుబంధు సాయాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులకు మాత్రమే అందించాలని కూడా రేవంత్ సర్కార్ నిర్ణయించినట్టు సమాచారం. గతంలో భూమి తెలంగాణలో ఉండి… దాని ఓనర్ ఏ రాష్ట్రంలో ఉన్నా వాళ్ళకి సాయం అందేది. కానీ వేరే రాష్ట్రాల వారికి ఎందుకు డబ్బులివ్వాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక వందల ఎకరాల భూములు కలిగిన బడా రైతులకు సాయం చేయడంపైనా విమర్శలున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి బడా భూస్వాములు కూడా రైతుబంధు తీసుకున్నట్టు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్సులు కట్టేవారికి రైతు బంధు తొలగించాలన్న డిమాండ్ కూడా వస్తోంది. ఎకరాల విషయంలోనూ లిమిట్ పెట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. ఇప్పటి దాకా రైతుబంధు సాయం పొందుతున్న రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా కొత్త గైడ్ లైన్స్ రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికిప్పుడు కొత్త పథకం అమలు చేయడం కష్టం కాబట్టి…. వచ్చే సీజన్ కు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని అందించనుంది. అప్పుడు పథకం పేరు కూడా రైతు భరోసాగా (Rythu Bharosa) మారనుంది.