Sachin Pilot: మొదటికొచ్చిన రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం.. తనదారి తనదే అంటున్న సచిన్ పైలట్.. పార్టీ వీడుతున్నారా?

సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అధిష్టానం సయోధ్య కుదిర్చినప్పటికీ, సచిన్ తనదారి తనదే అంటున్నాడు. తాజాగా సచిన్ తన నియోజకవర్గంలో పర్యటించాడు. ఈ సందర్భంగా తన పోరాటంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు.

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 02:34 PM IST

Sachin Pilot: రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అధిష్టానం సయోధ్య కుదిర్చినప్పటికీ, సచిన్ తనదారి తనదే అంటున్నాడు. తాజాగా సచిన్ తన నియోజకవర్గంలో పర్యటించాడు. ఈ సందర్భంగా తన పోరాటంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. అంటే మళ్లీ పాత అంశాలపై పోరాటం చేసే అవకాశం ఉందని తేల్చిచెప్పాడు. చాలా కాలంగా అశోక్, సచిన్ మధ్య విబేధాలున్న సంగతి తెలిసిందే.

గత సీఎం వసుంధరా రాజే ఆధ్వర్యంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సచిన్ ఉద్యమం చేశాడు. అధికారంలో ఉన్నది కూడా తన కాంగ్రెస్ పార్టీనే. ఈ విషయంలో సీఎంకు సచిన్ అల్టిమేటమ్ ఇచ్చారు. 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని కోరారు. డిమాండ్ గడువు ముగియడంతో అధిష్టానం రంగంలోకి దిగింది. సచిన్, అశోక్ గెహ్లాట్ మధ్య సయోధ్య కుదిర్చింది. ఈ సందర్భంగా పార్టీ కలిసి పని చేస్తామని ఇద్దరూ చెప్పారు. కానీ, ఇప్పుడు మళ్లీ ఈ అంశంపై సచిన్ స్పందించారు. యువత సమస్యల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో హైకమాండ్ సూచనల్ని కూడా సచిన్ పట్టించుకోవడం లేదు.

దీంతో సచిన్ ఏం చేస్తాడనే ఆసక్తి నెలకొంది. సొంతపార్టీకి చెందిన సీఎంపైనే తిరుగుబాటు చేయడమంటే సాధారణ విషయం కాదు. సచిన్ ఎందుకిలా చేస్తున్నాడన్నది అంతుపట్టని విషయం. అయితే, అతడి చర్యల వల్ల వ్యక్తిగతంగా సచిన్ ఇమేజ్ పెరుగుతోంది. ఇది అతడి రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. దీన్ని అడ్డం పెట్టుకుని సచిన్ కాంగ్రెస్ పార్టీని బెదిరించే అవకాశం ఉంది. మరోవైపు తనకు కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యం ఇవ్వకుంటే సొంతపార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నాడన్న వాదన కూడా ఉంది. లేదంటే బీజేపీవైపు చూసే అవకాశం ఉంది. తగిన ప్రాధాన్యం ఇస్తే బీజేపీలో కూడా చేరొచ్చు. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. అసలే ఇది ఎన్నికల సంవత్సరం.

రాజస్థాన్‌లో ఈ ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినా.. నేతల మధ్య విబేధాలున్నా.. ఆ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది. ఏదేమైనా సచిన్ పైలట్ అంశం రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఆందోళనకు కారణమవుతోంది.