Sarpanch Navya: ఎన్నికల బరిలో సర్పంచ్ నవ్య.. ఇండిపెండెంట్‌గా పోటీ..!

సర్పంచ్ నవ్య.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. శుక్రవారం ఆమె తన భర్తతో కలిసి నామినేషన్ వేశారు. దీంతో ఈ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది.

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 08:34 PM IST

Sarpanch Navya: జానకీపురం సర్పంచ్ నవ్య.. తెలంగాణ రాజకీయాల్ని పరిశీలించేవాళ్లందరికీ సుపరిచితమైన పేరు. బీఆర్ఎస్‌కు చెందిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై వేధింపుల ఆరోపణలతో వార్తల్లోకెక్కింది. ఆ తర్వాత పలు మీడియా సంస్థల ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యింది. ఇప్పుడిదంతా ఎందుకంటే సర్పంచ్ నవ్య.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. శుక్రవారం ఆమె తన భర్తతో కలిసి నామినేషన్ వేశారు. దీంతో ఈ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది.

TELANGANA CONGRESS: కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ నమ్మొచ్చా.. కాంగ్రెస్‌లో బీసీ అభ్యర్థులు ఎంతమంది..?

అయితే, ఈ ఎన్నికల్లో ఆమె ఎందుకోసం పోటీ చేస్తుందో కూడా వివరించింది. తాను ఓ వార్డ్ మెంబర్‌ నుంచి మొదలై, సర్పంచ్‌గా గెలిచానని, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచేందుకు నామినేషన్ వేశానని తెలిపారు. తన నిర్ణయం వెనుక ఎవ్వరి మీద పగ, కోపం లాంటివి లేవని, రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతోపాటు, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే పోటీ చేస్తున్నానని చెప్పారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం వంద శాతం అందరికీ సమాన హక్కులుంటాయని.. అవి మహిళలకు కూడా వర్తిస్తాయన్నారు. ప్రజలు కూడా వంద శాతం రాజకీయాల్లోకి రావాలని.. అందుకే తాను పోటీ చేసేందుకు ముందుకొచ్చానన్నారు. ప్రజలంతా తనను ఓ చెల్లిలా, అక్కలా, కుటుంబ సభ్యురాలిలా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో తాను అన్ని గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, తనను ఆశీర్వదించి గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సర్పంచ్ నవ్య.

తాను నామినేషన్ వేసింది మాత్రం వంద శాతం రాజకీయం చేయటం కోసమేనన్నారు. కాగా.. రాజయ్యపై వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత.. ఇద్దరి మధ్యా గతంలో రాజీ కుదిరింది. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్.. రాజయ్యకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టిక్కెట్ కేటాయించింది బీఆర్ఎస్. రాజయ్యకు టిక్కెట్ దక్కకపోవడానికి నవ్య చేసిన ఆరోపణలే కారణమనే వాదన కూడా ఉంది. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్ పూర్‌ నుంచి తాను కూడా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నానంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు విజ్ఞప్తి కూడా చేశారు.