MLC Kavitha: సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఈ నెల 26కు వాయిదా..?

కవిత తన విచారణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళల విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించాల్సిన తీరుపై కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఆమెతోపాటు అభిషేక్‌ బెనర్జీ, నళినీ చిదంబరం కూడా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిగింది.

  • Written By:
  • Updated On - September 15, 2023 / 02:34 PM IST

MLC Kavitha: ఈడీ సహా దర్యాప్తు సంస్థల ముందు మహిళల హాజరు అంశంపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కవిత తన విచారణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళల విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించాల్సిన తీరుపై కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఆమెతోపాటు అభిషేక్‌ బెనర్జీ, నళినీ చిదంబరం కూడా ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

దీనిపై తాజాగా విచారణ జరిగింది. ఈ పిటిషన్‌లపై ధర్మాసనం వాదనలు విన్న అనంతరం కేసు తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇదే తరహా కేసులో వచ్చే వారం కోల్‌కతా హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందో వేచి చూద్దామని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ అభిప్రాయపడ్డారు. కోల్‌కతా హైకోర్టు ఇచ్చే తీర్పును అనుసరించి, తదుపరి ఉత్తర్వులు ఇస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈడీ విచారణ సందర్భంగా మహిళలు ఆఫీసుకు వెళ్లక్కర్లేదంటూ.. వారిని ఇంటివద్దే విచారించాలంటూ.. దీనికి అనుగుణంగా ఆదేశాలివ్వాలంటూ కవిత కోర్టును కోరారు. ఆమెకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొంది. అయితే, తాను మహిళ అయినందున ఈడీ ఆఫీసుకు రాలేనని, ఇంటివద్దే తనను విచారించాలని కవిత కోరారు.

ఈ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరుతూ కూడా కవిత వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు ఈడీ పది రోజుల సమయం కోరింది. ఈ కేసులో పీఎంఎల్ఏ సెక్షన్ 160 కింద విజయ్ మదన్ లాల్ కేసును ఉదహరించింది ఈడీ. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు వచ్చే వరకు తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కవిత తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. నళిని చిదంబరం తరహా వెసలుబాటు కల్పించాలని కోరారు. దీనికి కోర్టు అంగీకరించింది. కోర్టు తీర్పు వెలువడేవరకు ఈడీ సమన్లు వర్తించవని పేర్కొంది. ఈ కేసులో జులై 28న ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం వేసిన పిటిషన్లను కూడా కవిత పిటిషన్లతో సుప్రీంకోర్టు జత చేసింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు తాను విచారణకు హాజరుకాలేనని ఇప్పటికే కవిత ఈడీ అధికారులకు తెలిపింది.