G20 Summit: జీ20 సదస్సు.. ఢిల్లీలో స్తంభించిన జన జీవనం.. మార్కెట్లు, స్కూల్స్ బంద్..!

130,000 మంది పోలీసులు, పారా మిలిటరీ సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన భద్రతాధికారులు ఈ సదస్సుకు భద్రత కల్పిస్తున్నారు. వైమానిక విభాగం కూడా భద్రతాచర్యల్లో పాల్గొంటుంది. సదస్సు జరిగే వేదికల వద్ద ఉన్న మురికి వాడల్ని అధికారులు తొలగించారు.

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 07:33 PM IST

G20 Summit: మరికొన్ని గంటల్లో జీ20 సదస్సు ప్రారంభం కానుంది. శనివారం న్యూ ఢిల్లీలో అమెరికాసహా వివిధ దేశాధినేతలతో జీ20 సదస్సు ప్రారంభం కానుంది. మోదీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాధి నేతలు హాజరవుతున్న అంతర్జాతీయ సదస్సు కావడంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. సదస్సు జరిగే శని, ఆది వారాలు ఈ భద్రత కొనసాగుతుంది.
130,000 మంది పోలీసులు, పారా మిలిటరీ సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన భద్రతాధికారులు ఈ సదస్సుకు భద్రత కల్పిస్తున్నారు. వైమానిక విభాగం కూడా భద్రతాచర్యల్లో పాల్గొంటుంది. సదస్సు జరిగే వేదికల వద్ద ఉన్న మురికి వాడల్ని అధికారులు తొలగించారు. ఈ ప్రాంతంలో సంచరించే కోతులు, వీధి కుక్కల్ని కూడా అధికారులు వేరే చోటుకు తరలించారు. అన్ని రకాల వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. మార్కెట్లు, రెస్టారెంట్లు వంటి అన్నింటినీ అధికారులు మూసేశారు. శుక్ర, శని, ఆది వారాల్లో.. అంటే మూడు రోజులపాటు షాపులు అన్నీ మూసే ఉంటాయి. దీనివల్ల తమకు రూ.400 కోట్ల నష్టం వస్తుందని వ్యాపారవర్గాలు తెలిపాయి. స్కూళ్లు, కాలేజీలుసహా అన్ని రకాల విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఢిల్లీలో సోమవారం నుంచి మళ్లీ సాధారణ జనజీవనం ప్రారంభమవుతుంది. సదస్సు జరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్ని కూడా మూసేశారు. బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు వంటివి కూడా నడవడం లేదు. అంబులెన్స్ వంటి అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంది. ఫుడ్ డెలివరీ సర్వీసెస్ కూడా నిలిచిపోయాయి. నిషేధం ఉన్న ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుకు చేరుకునే వాళ్లు నిర్ణీత ధృవపత్రాలు, టిక్కెట్లు చూపించాల్సి ఉంటుంది.
విదేశాల నుంచి వచ్చిన దేశాధినేతలు సహా అతిథులంతా ఢిల్లీలోని లగ్జరీ, స్టార్ హోటల్స్‌లోనే బస చేయబోతున్నారు. జీ20 సదస్సు వల్ల కలుగుతున్న అసౌకర్యాన్ని అర్థం చేసుకుని, సహకరించాల్సిందిగా స్థానిక ప్రజలను గతవారం మోదీ కోరారు. దేశమంతా ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోందని, అయితే, ఢిల్లీనే ఎక్కువ బాధ్యత తీసుకుంటోందని ఆయన అన్నారు. కాగా, జీ20 సదస్సుకు హాజరైన అతిథులు షాపింగ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. అన్ని షాపులు మూసి ఉండటం వారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. నగరానికి సంబంధించిన ట్రాఫిక్ మళ్లింపులపై కూడా అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నారు.