ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా…బుల్లెట్ దిగిందా ? లేదా ? అన్నది సినిమా డైలాగ్. దీన్ని రాజకీయాలకు అన్వయించుకుంటే మాత్రం…ఎవరికైనా సరే పరాభవం తప్పదు. రాజకీయాల్లో అనుభవం పెరిగితే కొద్దీ…పరిపక్వత అదే స్థాయిలో ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు…అనుసరించే విధానాలు…వేసే ప్రతి అడుగు…భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగానే ఉంటాయి. పాలిటిక్స్ లోకి వచ్చిన వెంటనే గెలిచేసేశాం…మంత్రి పదవి సాధించేశాం అంటే కుదరదు. పాలిటిక్స్ లో ఎవరికైనా సరే…అనుభవంతో పాటు చాలా ఓపిక ఉండాలి. ఓపిక అనేది లేకపోతే…ప్రజల్లో ఎంత బలమున్నా…ఆర్థికంగా స్థితిమంతుడైనా…రాజకీయాల్లో రాణించడం అంత సులువైన విషయం కాదు. అన్ని చోట్ల మహేశ్ బాబు సినిమా డైలాగ్ కొట్టవచ్చేమో కానీ…రాజకీయాల్లో మాత్రం అసలు కుదరదు.
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎప్పుడు కాచుకొని కూర్చొని ఉంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా…చెడుగుడు ఆడేద్దాం…బజారుకీడుద్దాం అని రెడీగా ఉంటారు. చేసే ప్రతి పనిని నిశితంగా గమనిస్తుంటారు. తాను సీఎం కొడుకు…తాను కేంద్ర మంత్రి కొడుకు…తనకు ప్రజల్లో బలం ఉందంటే కుదరదు. ప్రత్యర్థులతో ప్రజలు ప్రతి రాజకీయ నాయకుడి వ్యవహారశైళిని గమనిస్తుంటారు. సమయం, సందర్బం వచ్చినపుడు ఏం చేయాలో అది చేస్తారు. ప్రజా జీవితంలో ఉన్నవారంతా…ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న తప్పు జరిగినా…ప్రశ్నించేవారు…నిలదీసే గొంతులు ఎన్నో ఉంటాయి. పాతకాలంలో నోరు జారితే ఫర్వాలేదు…కానీ కాలు జారొద్దని సామెత ఉండేది. రాజకీయాల్లోకి వచ్చేసరికి…అది కాలు జారినా ఒకే…నోరు మాత్రం అదుపులో పెట్టుకోకపోతే అంతే సంగతి అనే ఎన్నో సంఘటనలు కళ్ల ముందు నిరూపించాయి. ఉదాహరణకు తెలంగాణ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు పారేసుకోవడం వివాదాస్పద మారింది. కేటీఆర్ నోటి దూల తగ్గించుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు.
ఎంతైనా సీనియర్ సీనియరే… కొండా సురేఖ అంశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు…ఎంతో పరిణతితో వ్యవహరించారు. అసలు సిసలు రాజకీయ నేతలా…తెలివిగా స్పందించారు. కొండా సురేఖపై జరుగుతున్న ట్రోలింగ్ ను హరీశ్ రావు ఖండించారు. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ…ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండించిన ఆయన…మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరని అన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అయినా…వ్యక్తిగతంగా అయినా తాను సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఒకే ఒక్క ట్వీట్ తో మాజీ మంత్రి హరీశ్ రావు…కొండా సురేఖ-కేటీఆర్ వివాదంలో మంచి మార్కులు సంపాదించారు. అటు రాజకీయాల్లో…ఇటు తెలంగాణ సమాజంలో హరీశ్ రావును నిజమైన రాజకీయకుడు…హుందాగా వ్యవహరించాడంటూ కితాబు ఇస్తున్నారు. 2004 నుంచి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న హరీశ్ రావు…ప్రజాజీవితంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్థి రాజకీయ నేతలను…ఏనాడు పల్లెత్తి మాట అనలేదు. రాజకీయ విమర్శలు చేశారే తప్పా…ప్రత్యర్థులను వ్యక్తిగతంగా విమర్శించలేదు. కేసీఆర్ తర్వాత పార్టీలో నంబర్ -2 ఉన్నప్పటికీ…ఆయన్ను ఎవరు వ్యక్తిగతంగా విమర్శించలేదు. కేటీఆర్ నోటి దూలను ప్రదర్శిస్తే…హరీశ్ రావు మాత్రం ఎంతో అనుభవం ఉన్న నేతలా…ఫక్తూ ప్రజానాయకుడిలా వ్యవహరించాడని అంటున్నారు. రాజకీయ నేతలెవరైనా సరే…ఓపిక ఉండాలి. భవిష్యత్ ను అంచనా వేసుకొని మసలుకోవాలి. తాను సీఎం కొడుకును…మాజీ మంత్రిని అని వీర్రవీగితే…పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రజల్లో డ్యామేజ్ అవడం తప్ప…ఎలాంటి లాభం ఉండదు. హరీశ్ రావును చూసయినా…కేటీఆర్ బుద్ది తెచ్చుకోవాలని తెలంగాణ ఆడపడచులు, రాజకీయ నేతలు చురకలు అంటిస్తున్నారు.
కొంప ముంచిన సోషల్ మీడియా ట్రోలింగ్
దుబ్బాకలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు…మంత్రి కొండా సురేఖ మోడలో దండవేశారు. దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా చిత్రీకరించింది. కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు…సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖను ట్రోల్ చేశారు. దీనిపై కొండా సురేఖ కంటతడి పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించిన కేటీఆర్…కొండా సురేఖ ఏడిస్తే తమకేం సంబంధం లేదన్నారు. గతంలో ఆమె మాట్లాడిన బూతులను గుర్తు చేసుకోవాలని సూచించారు. అక్కడి ఆగని కేటీఆర్…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క నోర్లను ఫినాయిల్ తో కడగాలని అసభ్యకరంగా కామెంట్స్ చేశారు. దీంతో మంత్రి సురేఖకు కోపం నషాలానికి ఎక్కింది. నన్నే అంత మాట అంటావా అంటూ…రెచ్చిపోయింది. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని…వారికి డ్రగ్స్ అలవాటు చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ మీడియా ముందే తీవ్ర ఆరోపణలు చేశారు. కొండా సురేఖ కామెంట్లు…జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. మొదట మాజీ మంత్రి కేటీఆర్ కు డ్యామేజ్ అయింది. కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడం…వివాదం పెద్దది కావడంతో కొండా సురేఖ…తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం జరిగిపోయింది. అయితే ఆమె చేసిన కామెంట్లు మాత్రం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.