Rayapati: వైసీపీ వైపు రాయపాటి చూపు..! టీడీపీకి షాక్ ఖాయమా..?

జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న రాయపాటి సాంబశివరావు త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు సీట్లకు వైసీపీ అధిష్టానం నుంచి హామీ లభిస్తే ఆయన గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

  • Written By:
  • Updated On - July 15, 2023 / 06:34 PM IST

గుంటూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలూ ఇక్కడ సరైన అభ్యర్థులకోసం వెతుకుతున్నాయి. మరోవైపు నేతలంతా తమకు టికెట్ ఎక్కడ దొరుకుతుందా ఆరా తీస్తున్నారు. ఉన్న పార్టీలో టికెట్ లభించే పరిస్థితి లేకపోతే వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఒకవేళ ఇతర పార్టీలో తమకు టికెట్  కు గ్యారెంటీ ఇస్తే వెంటనే గూడ దూకేందుకు సిద్ధమైపోతున్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న రాయపాటి సాంబశివరావు త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత. అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకపోవడంతో ఆయన వెంటనే టీడీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గెలిచారు. అయితే 2019లో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన ప్రతిపక్ష టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కన్నా లక్ష్మినారాయణ టీడీపీలో చేరడంతో వాళ్లిద్దరి మధ్య పాతవైరం మళ్లీ గుర్తుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచే వాళ్లిద్దరి మధ్య జిల్లాలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే ఇద్దరికీ తగిన గుర్తింపు ఇస్తానని మాటిచ్చి కన్నా లక్ష్మినారాయణను పార్టీలో చేర్చుకున్నారు చంద్రబాబు.

ఇటీవల కన్నా లక్ష్మినారాయణకు సత్తెనపల్లి అసెంబ్లీ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. దీన్ని రాయపాటి జీర్ణించుకోలేకపోతున్నారు. తన కుమారుడు రంగా బాబుకు గుంటూరు ఎంపీ, సోదరుడి కుమార్తె రాయపాటి శైలజకు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు రాయపాటి. అయితే గుంటూరు ఎంపీ స్థానాన్ని సిట్టింగ్ అయిన గల్లా జయదేవ్ కు మళ్లీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. రాయపాటి కుటుంబానికి ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నారు. అయితే అది రాయపాటికి ఇష్టం లేదు. రెండూ కావాలని పట్టుబడుతున్నారు. అందుకే ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది.

గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఆయన రాయపాటికి శిష్యుడు. రాయపాటి చొరవతోనే మాణిక్య వరప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు. తాను టీడీపీలో చేరిన తర్వాత డొక్కాను కూడా తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేశారు. అయితే మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరారు. ఇప్పుడు డొక్కా వరప్రసాద్ తో రాయపాటి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. రెండు సీట్లకు వైసీపీ అధిష్టానం నుంచి హామీ లభిస్తే ఆయన గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.