Shankar Naik: మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోది. ఎమ్మెల్యే తీరుపై పార్టీ నాయకులు, కార్యకర్తలు గరంగరం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో శంకర్ నాయక్‌కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. శంకర్ నాయక్‌ను మార్చకపోతే తిరుగుబాటు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. శంకర్ నాయక్‌కు టికెట్ ఇచ్చే విషయంలో సీఎం కేసీఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు.
శంకర్ నాయక్ వ్యతిరేక వర్గానికి ఎమ్మెల్సీ రవీందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా పరిణామాలు మారుతున్నాయి. మాకొద్దీ ఎమ్మెల్యే అంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, పార్టీ సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పట్టణ శివారులోని ఓ మామిడి తోటలో దాదాపు వంద మంది ప్రజాప్రతినిధులు సమావేశం అయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్ నాయక్‌కు మరోసారి టికెట్ ఇస్తే తాము మద్దతు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. సొంత పార్టీలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత వ్యక్తం కావడం ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.
నిజానికి శంకర్ నాయక్‌కు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతో పాటు చాలామంది బీఆర్ఎస్ నేతలతో విభేదాలు కొనసాగుతున్నాయి. శంకర్ నాయక్ వ్యవహారం కేసీఆర్ వరకు కూడా వెళ్లింది. గతంలో హోలీ పండగ రోజు పార్టీ శ్రేణులకు మద్యం పోసిన ఘటన క్రియేట్ చేసిన వివాదం అంతా ఇంతా కాదు. మరోవైపు ఈ మధ్య మహబూబాబాద్‌లో పర్యటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా శంకర్ నాయక్ మీద గుస్సా అవుతూ కనిపించారు. శంకర్ నాయక్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా కేటీఆర్ విదిల్చి కొట్టిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ మధ్య. అటు కేసీఆర్, ఇటు కేటీఆర్.. ఇద్దరూ శంకర్ నాయక్ మీద ఆగ్రహంతోనే ఉన్నట్లు తేలిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనను పక్కనపెట్టడం దాదాపు ఖాయం అన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం.