Sharad Pawar: శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ వల్లేనా? లేక డ్రామానా?

కొంతకాలంగా ఎన్సీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. పార్టీ చీఫ్ శరద్ పవార్‌కు, అదే పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన అన్న కొడుకు అజిత్ పవార్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చి, బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - May 2, 2023 / 07:11 PM IST

Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. ఎన్సీపీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన శరద్ పవార్ తన అధ్యక్ష పదవికి మంగళవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పార్టీలో తిరుగుబాటు రానున్న నేపథ్యంలోనే ముందుజాగ్రత్తగా ఆయన రాజీనామా చేశారా? లేక డ్రామానా? అజిత్ పవార్ ఏం చేస్తారు?
కొంతకాలంగా ఎన్సీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. పార్టీ చీఫ్ శరద్ పవార్‌కు, అదే పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన అన్న కొడుకు అజిత్ పవార్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చి, బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఎన్సీపీ కూడా శివసేనలాగే చీలిపోతుందేమో అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముంబైలో తన ఆటో బయోగ్రఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో శరద్ పవార్ ఈ సంచలన ప్రకటన చేశారు. అయితే, తాను పార్టీ పదవికి మాత్రమే దూరమయ్యానని, ప్రత్యక్ష రాజకీయాలకు కాదని ఆయన చెప్పారు. పదవులకు సంబంధించి ఎక్కడ ఆగిపోవాలో తనకు తెలుసన్నారు.

ఇంతకాలం పార్టీని ముందుండి నడిపించిన శరద్ పవార్ రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు దశాబ్దాలకుపైగా పార్టీని విజయపథంలో నడిపించిన చరిత్ర శరద్ పవార్‌ది. అలాంటిది ఆయన తప్పుకొంటే ఎలా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ.. తన రాజీనామా నేపథ్యంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కమిటీలో ఆ పార్టీ సీనియర్ నేతలు అజిత్ పవార్, రాజేశ్ తోపే, జితేంద్ర వాహద్, కేకే శర్మ, పీసీ చాకో, జయంత్ పాటిల్, సుప్రియో సూలే, ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కారే, చగన్ భుజ్‌బల్, హసన్ ముషిరిఫ్, దనుంజయ్ ముండే, దిలీప్ వాస్లే పాటిల్, అనిల్ దేశ్‌ముఖ్ ఉన్నారు.
శరద్ పవార్ కూతురు ఏం చెప్పింది?
అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీంతో పార్టీని చీల్చి అజిత్ పవార్ బీజేపీతో కలవబోతున్నారని ప్రచారం మొదలైంది. వీటిని అటు అజిత్, ఇటు శరద్.. ఇద్దరూ కొట్టేశారు. తాను పార్టీని చీల్చాలనుకోవడం లేదని అజిత్ పవార్ కూడా తెలిపారు. మరోవైపు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 15 రోజుల్లో దేశ రాజకీయాల్లో రెండు పెద్ద కుదుపులు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఒకటి ఢిల్లీలో అయితే, మరోటి మహారాష్ట్రలో అంటూ చెప్పారు. దీంతో శరద్ పవార్ రాజీనామా, తదనంతర పరిణామాల గురించే అయి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, పార్టీలో ఒక వర్గం అజిత్ పవార్ నాయకత్వాన్ని సమర్ధిస్తోంది. ఆయన కూడా పార్టీలో తనకంటూ ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు.


శివసేన మాదిరిగానే చీలుతుందా?
గత ఏడాది శివసేన పార్టీని చీల్చిన షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి పార్టీని ఏర్పాటు చేశాయి. తర్వాత ఈ కూటమి కూలిపోయింది. ఇప్పుడు శరద్ పవార్ కూడా ఇలాగే ఎన్సీపీని చీల్చి, బీజేపీతో చేరుతారేమో అనుకుంటున్నారు విశ్లేషకులు. అయితే, శరద్ పవార్ తన రాజీనామా ద్వారా పార్టీలో ఏదైనా డ్రామా ప్లే చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాను రాజీనామా చేయడం ద్వారా సెంటిమెంట్ రగిల్చి, తద్వారా పార్టీని కాపాడుకుందామనే ఎత్తుగడ ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతోంది. కాగా, పార్టీని అజిత్ పవార్ చేజిక్కించుకుంటే పరిణామాలు మారిపోయే అవకాశం ఉంది. తదుపరి అధ్యక్షుడిగా అజిత్ ఎన్నికైతే ఏం జరుగుతుందో చూడాలి.
మాట మార్చిన పవార్
పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటున్నట్లు, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్లు ప్రకటించిన శరద్ పవార్ కొన్ని గంటల్లోనే మాట మార్చారు. ఈ విషయంలో పునరాలోచన చేస్తానన్నారు. తన నిర్ణయాన్ని అమలు చేసేందుకు మరో మూడు రోజులు సమయం తీసుకుంటున్నట్లు చెప్పారు. పవార్ గంటల వ్యవధిలోనే మాట మార్చడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది.
1999 నుంచి పార్టీ అధ్యక్షుడిగా
కాంగ్రెస్ పార్టీలో ఉన్న శరద్ పవార్ 1999లో ఆ పార్టీ నుంచి విడిపోయి ఎన్సీపీని స్థాపించారు. అప్పటినుంచి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా, కేంద్ర రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ తరఫున నాలుగుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే కేంద్ర మంత్రిగానూ పని చేశారు. 2017లో ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చింది.