షర్మిల వర్సెస్ జగన్, లేఖలు లీక్, అసలేం జరుగుతోంది…?

వైఎస్ కుటుంబ రచ్చపై తెలుగుదేశం పార్టీ సంచలన లేఖలు బయటపెట్టింది. వైఎస్ జగన్, షర్మిల మధ్య రాయబేరం నడుస్తోందనే ప్రచారం నడుస్తొంటే టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాల్లో కీలక లేఖలను బహిర్గతం చేసింది.

  • Written By:
  • Publish Date - October 24, 2024 / 11:48 AM IST

వైఎస్ కుటుంబ రచ్చపై తెలుగుదేశం పార్టీ సంచలన లేఖలు బయటపెట్టింది. వైఎస్ జగన్, షర్మిల మధ్య రాయబేరం నడుస్తోందనే ప్రచారం నడుస్తొంటే టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాల్లో కీలక లేఖలను బహిర్గతం చేసింది. జగన్ కు, ఆయన సోదరి షర్మిలకు వారి తల్లి వైఎస్ విజయమ్మకు జరిగిన లేఖలను ఒక్కొక్కటిగా టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అసలు ఆ లేఖల్లో వారి మధ్య ఏం జరిగిందనే విషయం ఒకసారి పరిశీలిస్తే…

“మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆ షరతుకి అంగీకరిస్తున్నాని ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకి నేను ఒప్పుకోను అంటూ నిరాకరించారు . భారతి సిమెంట్స్‌, సాక్షి ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే నిర్ద్వంద్వంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా.” అంటూ షర్మిల ఒక లేఖ రాయగా దానిపై విజయమ్మ కూడా సంతకం చేసారు.

మరో లేఖలో జగన్ నిజ స్వరూపాన్ని ఆ ఇద్దరూ బయటపెట్టారని టీడీపీ పోస్ట్ చేసింది. “ప్రేమ, ఆప్యాయతలతో నాకు బదిలీ చేసినట్లు చేసుకున్న అవగాహన ఒప్పందం, (MOU)లో పేర్కొన్న ఆస్తులు, ఇవన్నీ మన తండ్రి ఆదేశాలను పాక్షికంగా నెరవేర్చడం కోసం మాత్రమే. నేను పాక్షికంగా అని చెప్పడానికి కారణం సాక్షి మరియు భారతి సిమెంట్స్ లో మెజారిటీ వాటా నిలుపుకోవాలని మీరు పట్టుబడుతున్నారు కాబట్టి. ఇప్పటికవరకు మీదే పై చేయి కాబట్టి నన్ను పూర్తిగా అణిచివేశారు. కాబట్టి MOUలో పేర్కొన్న విధంగా మేము ఒక పరిష్కారానికి అంగీకరించాము. మీరు నాకు అన్నయ్య కాబట్టి, కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో నా సమాన వాటాను వదులుకోవడానికి అంగీకరించాను. ఆ విధంగా, 31.08.2019న అమలు చేయబడిన ఎంఓయూ ప్రకారం, నాకు కొన్ని ఆస్తులు మాత్రమే కేటాయించబడ్డాయి.” అని షర్మిల మరో లేఖతో బాంబు పేల్చారు.

ఇక జగన్ కు ఆవేదనతో చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ మరో లేఖ రాసారు. “మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎమ్‌ఓయు ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఈ విదంగా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తోంది.” అని షర్మిల లేఖ రాయగా… సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్న నువ్వు నీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు లాక్కోవటానికి సిద్ధమయ్యావా జగన్ మోహన్ రెడ్డి? అంటూ టీడీపీ ఫైర్ అయింది.

జగన్ మనస్తత్వం గురించి చెప్తూ చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ మరో లేఖ రాసారు. “ఇప్పుడు మీరు మన తండ్రి ఆదేశాలకు తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా ఎంఓయూని రద్దు చేయాలని కోరుతున్నారు. చట్టపరంగా మీ లేఖ ఎంఓయూకి విరుద్ధం దానికి ఏమాత్రం పవిత్రత లేదు. కానీ మీ లేఖ వెనుక ఉన్న దురుద్దేశం నాకు చాలా బాధ కలిగించింది. ఇది మన తండ్రి మీద మీకున్న గౌరవాన్ని తగ్గించే విధంగా వుంది. ఆయన ఎన్నడూ కలలో కూడా ఊహించని పని చేసారు మీరు. చట్టబద్దంగా మీ కుటుంబ సభ్యులకు చెందాల్సిన ఆస్తులను లాక్కోవటానికి సొంత తల్లి మీద, నా మీద కేసులు పెట్టారు.” అని షర్మిల మరో లేఖలో సంచలన కామెంట్స్ చేసారు.

జగన్ రెడ్డికి వికృత మనస్తత్వం వివరిస్తూ, లేఖ రాసిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ అంటూ టీడీపీ మరో లేఖను బయటపెట్టింది. “MOU ప్రకారం నా వాటాలో భాగంగా నాకు ఇవ్వబడిన సరస్వతి పవర్‌పై, MOU ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే దాని షేర్లన్నింటినీ నాకు బదిలీ చేస్తానని మీరు హామీ ఇచ్చారు. అయితే, మీరు చాలా సంవత్సరాలుగా హామీ నెరవేర్చడంలో విఫలమయ్యారు. మన తల్లి భారతి సిమెంట్ మరియు సండూర్‌లకు చెందిన షేర్లను పొందిన తర్వాత, మిగిలిన షేర్లను మీరు బహుమతిగా ఇచ్చిన తర్వాత కూడా ఫిర్యాదు చేయడం సరి కాదు. మీరు మన తల్లికి సరస్వతి పవర్ షేర్లపై పూర్తి హక్కులు ఇస్తూ గిఫ్ట్ డీడ్‌ల పై సంతకాలు చేశారు. షేర్లతో విడిపోవడానికి అంగీకరించిన తర్వాత, మీరు ఇప్పుడు అనవసరమైన వివాదాలను లేవనెత్తడానికి మరియు కుటుంబాన్ని కోర్టుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నారు. సరస్వతీ పవర్‌లో నాకు వాటాలు లేకుండా చేయాలనే మీ ఉద్దేశ్యంతోనే ఇది జరిగింది. చట్టబద్దంగా దాని మీద నాకు పూర్తి అర్హత వుంది.” అని షర్మిల స్పష్టం చేస్తూ మరో లేఖ రాసారు.

ఇక కోర్ట్ కు ఎక్కడంపై కూడా లేఖలు రాసారు. “MOU చేసుకున్న దాని ప్రకారం కాకుండా, మీరు తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధం. 20 ఎకరాల యలహంక ఇంటి ఆస్తితో సహా, MOUలో పేర్కొన్న అన్ని ఆస్తులకు సంబంధించి చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతీ దానికి నేను కట్టుబడి వున్నాను.” అని లేఖలో ప్రస్తావించారు. దీనిపై టీడీపీ స్పందిస్తూ… చట్ట విరుద్ధమైన పనులు చేయడం జగన్ మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అవసరమైతే తన సొంత తల్లి, చెల్లిని కూడా రోడ్డు మీదికి లాగుతాడు అంటూ తమ సోషల్ హ్యాండిల్స్ లో కామెంట్ చేసింది టీడీపీ.

చెల్లి షర్మిల రాజకీయ జీవితం పై అసూయ, ఈర్ష్య తో, షర్మిలని రాజకీయాల నుంచి తప్పుకోవాలని జగన్ చేసిన నీచమైన ఆలోచన గురించి లేఖలో ప్రస్తావించిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ అంటూ మరో లేఖను బయటపెట్టారు. “నా రాజకీయ జీవితం పూర్తిగా నాకు సంబంధించింది. నా వృత్తి పరమైన జీవితాన్ని నిర్దేశించడానికి నేను మిమ్మల్ని అనుమతించను. బహిరంగ వేదికలపై మీకు మరియు అవినాష్‌కు వ్యతిరేకంగా మాట్లాడకుండా నాతొ మీరు సంతకం చేయుంచుకున్నారన్నది అసంబద్ధం. సెటిల్‌మెంట్‌కు రావాలని నాకు షరతు విధించడం అనేది కూడా పూర్తిగా అసమంజసమైనది.” అని షర్మిల ఘాటు లేఖ రాసారు.

మన తండ్రి అన్ని ఆస్తులలో తన మనవళ్లందరికీ మానవరాలకి సమాన వాటా ఉండాలని కోరుకున్నాడు. అంతే గాని దాని మీద రాజకీయమైన ప్రభావాలేవీ వుండకూడదు. నా రక్త సంబంధమైన అన్నగా మీరు ఇష్టపూర్వకంగా సంతకం చేసిన ఎంవోయూని అమలు చేయడం మీ బాధ్యత అంటూ షర్మిల ప్రస్తావించారు.

ఇక జగన్ రెడ్డికి విలువలు విశ్వసనీయత లేని వాడని , లేఖలో చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ రాసారు. “దివంగత నేత మన తండ్రి కోరికలను నెరవేర్చడానికి మరియు చేసుకున్న అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉండటంలో మీరు మీ నైతికతను కోల్పోయారు. మీరు దాని నుండి బయట పడతారాని ఆశిస్తున్నాను. మీరు అలా చేయకూడదని నిర్ణయించుకుంటే చట్ట పరంగా ముందుకు వెళ్ళడానికి నాకు పూర్తి హక్కులు వున్నాయి. ఇవన్నీ వాస్తవాలే అని నిర్ధారించడానికి మన తల్లి కూడా ఈ లేఖపై సంతకం చేసింది. ” అంటూ మరో లేఖలో ప్రస్తావించారు. సొంత తల్లి, చెల్లి కూడా అసహ్యించుకుంటున్నా జగన్ మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రావడం లేదు అని టీడీపీ ఆరోపించింది.

“నన్ను రాజకీయంగా ఏమి అనకు, రాజకీయంగా నాకు అడ్డు రాకు, అప్పుడు నీకు ఆస్తులు రాసిస్తా” అంటూ షర్మిలను జగన్ బెదిరిస్తూ లేఖ రాసారు. “నన్ను రాజకీయంగా ఇబ్బందులు పెడుతుంటే, నీకు నేను ఆస్తులు ఎందుకు ఇవ్వాలి ? రాజకీయంగా నా పై విమర్శలు చేస్తున్న నీకు, నేను చిల్లి గవ్వ ఇవ్వను. సరస్వతి సిమెంట్స్ షేర్స్ తిరిగి ఇచ్చేయండి..అమ్మ మీద, నీ మీద కేసు వేస్తున్నా.” అంటూ జగన్ మరో లేఖ రాసి కేసు వేసారు.

జగన్ ని సైకో అని ఎందుకు అంటారో, ఇప్పుడు తెలిసిందా ? ఆస్తి కోసం, డబ్బు కోసం, సొంత తల్లి పైనే కేసులు వేసి, కోర్టుకి లాగాడు. చెల్లి రాజకీయాల్లో ఉంటే తట్టుకోలేక పోతున్నాడు. రాజకీయాల నుంచి తప్పుకుంటేనే ఆస్తులు రాసిస్తా అని బెదిరిస్తున్నాడు అని టీడీపీ వరుస లేఖలను బహిర్గతం చేసింది.