తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వ్యవహారం వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. అక్కడ ఎంపీ పిల్లి సుభాశ్ చంద్రబోస్ కు, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు అస్సలు కుదరట్లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు వాళ్లిద్దరూ తలపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఎంపీ పిల్లి సుభాశ్ చంద్రబోస్ బహిరంగంగానే ప్రకటించారు. అధిష్టానం బుజ్జగించినా ఆయన వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ఆయన త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని నియోజకవర్గంలో జోరుగా టాక్ నడుస్తోంది. ఆయనతో పాటు కుమారుడు కూడా జనసేనలో చేరుతారని సమాచారం.
పిల్లి సుభాశ్ చంద్రబోస్ సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ మరణానంతరం జగన్ తో ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకూ ఆయన ప్రయాణం వైసీపీలో సాఫీగానే సాగింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు జగన్. మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపించారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో తనకు లేదా తన కుటుంబానికి రామచంద్రాపురం అసెంబ్లీ సీటు ఇవ్వాలని పిల్లి పట్టుబడుతున్నారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను కాదని టికెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా లేరు. ఇదే విషయాన్ని పిల్లికి జగన్ స్పష్టం చేశారు. అయితే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు పిల్లి సుభాశ్ చంద్రబోస్.
పిల్లి సుభాశ్ చంద్రబోస్ కు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ హైకమాండ్ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే పరిస్థితి చేయిదాటిపోయినట్లు అర్థమవుతోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే పిల్లి సుభాశ్ చంద్రబోస్ ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. తన ఎంపీ క్వార్టర్స్ ను కూడా ఖాళీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. అనంతరం పార్టీకి కూడా రాజీనామా చేయనున్నారు. త్వరలోనే పిల్లి సుభాశ్ చంద్రబోస్ తో పాటు కుమారుడు పిల్లు సూర్యప్రకాశ్ జనసేనలో చేరేందుకు సర్వం సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం టికెట్ ను సూర్య ప్రకాశ్ కు ఇచ్చేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ మారేందుకు పిల్లి ఫ్యామిలీ నిర్ణయించుకుంది. వైసీపీలో ఉంటే తమకు టికెట్ రాదని అర్థం కావడంతో పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు సమాచారం.