తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో.. ఇప్పుడు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 27న ఎలక్షన్స్ నిర్వహిస్తోంది కేంద్ర కార్మికశాఖ. ఇక్కడ ఇప్పటి వరకూ బీఆర్ఎస్ కి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రికగ్నైజ్డ్ యూనియన్ గా ఉంది. కానీ కోల్ బెల్ట్ ఏరియాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ పాగా వేయడంతో ఈసారి BRS అనుబంధ సంఘానికి ఓటమి తప్పేలా లేదు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్ర కార్మిక శాఖ దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. దాంతో మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికలతో కోలాహలంగా ఉన్న కోల్ బెల్ట్ ఏరియాలో మళ్ళీ సందడి కనిపిస్తోంది. సింగరేణిలో మొత్తం 45 వేల దాకా ఓట్లు ఉన్నాయి. అయితే తెలంగాణలో సింగరేణి కాలరీస్ విస్తరించిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, మంథని, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగుతో పాటు కాంగ్రెస్ బలపరచిన కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి గెలిచారు.
ఇప్పటివరకూ సింగరేణి కాలరీస్ లో బీఆర్ఎస్ కి అనుబంధమైన TGBKS గుర్తింపు పొందిన సంఘంగా కొనసాగుతోంది. కల్వకుంట్ల కవిత ఈ సంఘానికి గౌరవ అధ్యక్షురాలు కూడా. అయినా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సంఘం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కోల్ బెల్ట్ ఏరియాలో ఒక్క సీటు గెలవకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫలితాల వెల్లడి తర్వాత ఆయన మాట్లాడినప్పుడు .. కార్మికులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామనీ, డిపెండెంట్స్ కి ఉద్యోగాల కల్పన, 32శాతం బోనస్ ఇచ్చామన్నారు. కానీ సింగరేణిలో ఖాళీల భర్తీలో అక్రమాలు, ఆదాయం పన్ను ఎత్తివేతపై హామీలు ఇవ్వకపోవడం గులాబీ పార్టీకి శాపంగా మారినట్టు తెలుస్తోంది. స్థానిక సమస్యలు కూడా కాంగ్రెస్ గెలుపునకు కారణం అయ్యాయి. కాంగ్రెస్ హవాతో ఈసారి సింగరేణి కాలరీస్ గుర్తింపు సంఘంగా ఆ పార్టీకి చెందిన INTUC నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే చాలా యేళ్ళ తరువాత INTUC సింగరేణిలో పాగా వేయనుంది.