Jagan Social Media: జగన్ సోషల్ మీడియా స్ట్రాటజీనే నమ్ముకున్నారా?

జగన్.. ఈపేరు వినగానే వినిపించే ఒకప్పటి స్వరం అబ్బ నాయకుడంటే ఇలా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. ఈ మాట కేవలం మేము చెబుతున్నది కాదు. స్వయానా జగన్ తన నోట తానే అన్న మాట. అంత స్పష్టంగా అనకపోయినా జగన్ మోహన్ రెడ్డితో.. అతని పార్టీతో దగ్గరగా పనిచేసిన వారు చెబుతున్న అంతరంగం ఇది.

  • Written By:
  • Updated On - April 4, 2023 / 12:59 PM IST

తాజాగా విజయవాడలో గడపగడపకు ఎమ్మెల్యేల మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ వెనుక అనేక లుకలుకలు, గుసగుసలు, ఎకసకలు వినిపిస్తున్నప్పటికీ అందులో ఎంత వాస్తవం ఉందో ఎంత అసత్యం ఉందో తెలియదు. కానీ సామజిక మాధ్యమాల విషయంలో మాత్రం ఈ థీరీ కాస్త ప్రాక్టికల్ గా మారిపోయింది. గతంలో సోషల్ మీడియా అంటే జగన్, జగన్ అంటే సోషల్ మీడయా అనేలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కాస్త విరుద్ద భావనకు దారితీసింది. దీనికి కారణం మాత్రం అధికారానికి ముందు ఒక విధంగా.. అధికార పీఠంలో కూర్చున్న తరువాత మరోవిధంగా అధినాయకుడు ప్రదర్శించిన తీరే దీనికి తార్కాణం.

ఇదేదో నోటి మాటలతోనో.. పిచ్చిరాతలతోనో చెబుతున్న విషయం కాదు. ఎల్లో మీడియాలాగా.. పక్షపాత వైఖరితో చేస్తున్న దుష్ప్రచారం అంతకన్నాకాదు. అక్షర సత్యంతో.. పచ్చి ఆధారాలతో చూపిస్తున్న వాస్తవం. సామాన్యుడు నమ్మకపోవచ్చు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలుగా పనిచేసిన వారు దీనికి మంగళ హారతి పడతారు. ఎందుకంటే వారు ఇలాంటి గడ్డుపరిస్థితి ఎదుర్కొని ఉంటారు కనుక. ఎవరైనా ఒకపార్టీలో సామాన్య కార్యకర్తగానో, పార్టీ శ్రేణులుగానో ఎందుకు చేరతారు. తనకు ఏమైనా అవసరం అయితే పార్టీ చూసుకుంటుంది కదా అన్న నమ్మకంతో లేదా పార్టీ నాయకుడు అండగా ఉంటాడన్న ధీమాతో తొలి అడుగు వేస్తారు. అలా వేసిన కార్యకర్తలు ఇప్పుడు చివరి అడుగుగా అట్టడుగున బ్రతకాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గతంలోని వైసీపీ సోషల్ మీడియా బలాన్ని.. నేడు ఉన్న జగన్ సోషల్ మీడియా బలంతో ఒక్కసారి అంత:కరణ శుద్దిగా లెక్కలేసి చూసుకుంటే అధినేతకు నిద్రకూడా పట్టని పరిస్థితి.

జగన్ సోషల్ మీడియా సైన్యం 2009-10 కాలంలో ప్రారంభమైంది. అది క్రమక్రమంగా విస్తరించుకుంటూ 2014 ఎన్నికల సమయానికి సామాజిక మాధ్యమాల్లో అక్కడక్కడా కనిపించే స్థాయికి ఎదిగింది. ఇక 2017 తరువాత అప్పటి చంద్రబాబు అసంతృప్త పాలనకు విసిగిపోయిన యువత క్రమక్రమంగా జగన్ గూటికి చేరడం ప్రారంభించారు. ఇక 2018-19 వచ్చే సమయానికి ఎక్కడాలేనన్ని వైఎస్ఆర్సీపీ గ్రూపులు ఫేస్ బుక్ లో, వాట్సప్ లో విస్తృతంగా కనిపించాయి. ఇలా పెరగడానికి కారణం అప్పట్టో ఉన్న నిరుద్యోగం. చంద్రబాబు చెప్పిన మాటలకు, చేసిన చేష్టలకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. అందుకే యువనాయకుడిగా జగన్ కనిపించడం. పాదయాత్ర అప్పటికే ప్రారంభం అవ్వడం ఇవన్నీ వెరిసి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. అన్న వస్తున్నాడు ఏదో చేసేస్తాడు అన్న భ్రమలోకి వెళ్లిపోయారు సామాజిక మాధ్యమాల కార్యకర్తలు.

సోషల్ మీడియాను సాధారణ కార్యకర్తలు మొదలు సెలబ్రిటీల వరకు అందరూ జగన్ భజన మనస్పూర్పిగా చేసేవారు. ఇది మాత్రం నిజం. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే అప్పుడు జగన్ పేరు మీద పార్టీ మీద వచ్చినన్ని పాటలు ఏ నాయకుడికి రాలేదు. రాయలేదు కూడా. అలా పాటలు మొదలు సామాజిక మాధ్యమాల్లో ఎవరికి తోచిన విధంగా వారు వీడియోలు చంద్రబాబును విమర్శిస్తూ జగన్ ను పొగుడుతూ వందల వీడియోలు ట్రెండ్ అయ్యాయి. ఇంకా లెక్కలు పక్కాగా చెప్పాలంటే నరేంద్రమోదీ తరువాత సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డే అనేలా మారిపోయింది అప్పుటి వాతావరణం. ఆ భజనలో కొందరు సెలబ్రిటీలకు అత్యున్నత అధికార పీఠాలు వరించాయి. మరికొందరు దక్కించుకొని పోగొట్టుకున్నారు. వారు ఎవరో ఈపాటికే మీరు గుర్తుకు వచ్చి ఉంటుంది. కానీ సామాన్యులు మాత్రం దిక్కు లేని పరిస్థితిలో పడిపోయారు.

Social Media Official

స్వచ్ఛంద సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా చిన్న స్థాయి అధికార పోరు ఉండేది. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి సోషల్ మీడియా ఇంచార్జ్ పోస్టుల కోసం రాజకీయాలు జరిగేవి. వీటిలో ఎమ్మెల్యేల జోక్యం కూడా ఉండేది. అలా పనిచేసిన వాళ్లకు ఇచ్చిన హోదా ఏమిటంటే.. తమ సామీపీకులకు పెంఛన్ రాలేదని వాటంటీర్ ను అడిగినా.. కార్పొరేటర్ ని కలిసినా సరైన స్పందన ఇవ్వనంతగా అధికార బలుపు పేట్రేగిపోయింది. ఎక్కడైనా మార్పు స్వచ్ఛందంగా వస్తే దాని పవర్ షేకింగ్ గా ఉంటుంది. అదే డబ్బులు వెచ్చించి ప్రచారం చేసుకుంటే కొంత సమయం వరకు మాత్రమే మెరుస్తుంది. తరువాత అంధకారమే చుట్టుముడుతుంది. ఇంకా ఇలాంటి ఉదంతాలు వేలకు వేలు ఉన్నాయి.

రాష్ట్రస్థాయిలో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి లాంటి వారికి సోషల్ మీడియా పగ్గాలు అప్పజెప్పి విజయవాడ వేదికగా సోషల్ మీడియా కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. దీనికి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిని కూడాబెట్టుకున్నారు. ఆ సమావేశంలో చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. అందరికీ సరైన హాదాను కల్పిస్తాము, ప్రతి మండలానికి, జిల్లాకి ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తాము. ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డును మంజూరు చేస్తాము అన్న వాగ్ధానాలు ఏ ఫ్యాను గాలిలోనో కలిసిపోయాయి. అందుకే జగనన్న సోషల్ మీడియా సైన్యం ఒక్కొక్కరిగా విషయాన్ని గ్రహించి పిట్టలు రాలినట్లుగా ప్రచార కార్యక్రమాల నుంచి వైదొలుగుతూ వచ్చారు.

ఒకప్పుడు ఉన్న ఫాలోయింగ్ సోషల్ మీడియాలో జగన్ కు నేడు లేదు కాబట్టే తాజాగా జరిగిన గడపగడపకు కార్యక్రమంలో సోషల్ మీడియాను యాక్టివ్ చేసుకోవాలి అనే మాట అనాల్సివచ్చింది. 2019లో ఎన్నికలకు ఒక్క సంవత్సరం ముందు ఉన్న సామాజిక మాధ్యమ గణాంకాలకు.. 2024లో జరగబోయే ఎన్నికలకు సంవత్సరం ముందు అనగా ఈ 2023లో ఉన్న సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తే విషయం మీకే తెలిసిపోతుంది. 2018లో జగన్ ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు అధికార నాయకుడు. వాస్తవంగా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే ఇంకా యాక్టివ్ గా ఉండాలి. కానీ అలాంటి వాతావరణం ఇక్కడ కనిపించడం లేదు. అందుకే సోషల్ మీడియాను యాక్టీవ్ చేసుకోవాలి అన్న మాట జగన్ నోట వినిపించింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైట్ లోకి వెళ్లి చూస్తే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న సభ్యులు సీఎం సొంత జిల్లాలో లేరు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే అధికార సోషల్ మీడియా వెబ్సైటే అప్డేట్ లో లేదు. భవిష్యత్తులో జరగబోయే ఈవెంట్స్ గురించి, గతంలో జరిగిన కార్యక్రమాల గురించి ఎలాంటి విశేషాలు నమోదు చేయలేదు. అప్పట్లో పీకే లాంటి వారు కొన్ని వెబ్ సైట్లు క్రియేట్ చేసి ప్రచారం చేస్తూ ఉండేవారు. వారి ఎఫెక్ట్ ఇప్పుడు తగ్గిపోయింది. వారిని డబ్బులకు కొనుగోలు చేశారు. కొన్ని సంవత్సరాల వరకూ. కానీ నిజమైన వారిని చేతిలో పెట్టుకొని ఉండి ఉంటే నేడు మళ్లీ ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తల అవసరం సోషల్ మీడియా ను యాక్టివ్ చేయడానికి వచ్చేదికాదు.

సామాన్య సోషల్ మీడియా కార్యకర్తలకు ఛైర్మెన్ లాంటి పదవులు అక్కర్లేదు. తమకు చిన్న ఉద్యోగమో, ఉపాధో, తమ పరిధిలో ఎవరికైనా లబ్ధి అందకుంటే వారికి సాయం చేసేందుకు కావల్సిన పలుకుబడిని సోషల్ మీడియా కార్యకర్తలకు అందిస్తే గతంలో కంటే కూడా ఇప్పుడు ఫాలోవర్స్ రెట్టింపు సంఖ్యలో ఉండేవారు. అలా చేయకుండా ఎన్నికలకు మాత్రమే ఉపయోగించుకుంటాం. అధికారం వచ్చాక వదిలేస్తాం అంటే మీరు అధికారంలో ఉన్న సమయంలోనే సామాజిక మాధ్యమ కార్యకర్తలు మిమ్మల్ని వీడి తమ పని తామే చూసుకునే ప్రమాదం ఉంటుంది. మరోసారి జరిగే ఎన్నికలకు వారి మద్దతు కూడబలుక్కోవడానికి సాయశక్తులా కృషిచేయాల్సి వస్తుంది. ఒకానొక సమయంలో అలా అడిగినప్పుటికీ రాని పరిస్థితులు ఎదురవ్వక తప్పదు. ఎందుకంటే మీకు అధికార రాజకీయం ముఖ్యం అయితే సోషల్ మీడియా కార్యకర్తలకు ఆత్మగౌరవం ముఖ్యం కనుక.

 

T.V.SREEKAR