జస్ట్ ఆస్కింగ్… పవన్‌, ప్రకాష్‌రాజ్‌ కొట్లాట ఎంతవరకు..?

పవన్‌కళ్యాణ్‌, ప్రకాష్‌రాజ్‌ ఇద్దరూ మంచినటులు. సినిమాల్లో బోలెడు ఫైటింగ్‌లు చేసుకున్నారు. వీళ్లిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనబడితే ఫ్యాన్స్‌కు పూనకాలే...ఒకరు నందా అయితే ఇంకొకరు బద్రీనాథ్. అయితే మేకప్‌ తీయగానే ఆ యుద్ధానికి ప్యాకప్‌ చెప్పేవారు.

  • Written By:
  • Publish Date - October 8, 2024 / 05:42 PM IST

పవన్‌కళ్యాణ్‌, ప్రకాష్‌రాజ్‌ ఇద్దరూ మంచినటులు. సినిమాల్లో బోలెడు ఫైటింగ్‌లు చేసుకున్నారు. వీళ్లిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనబడితే ఫ్యాన్స్‌కు పూనకాలే…ఒకరు నందా అయితే ఇంకొకరు బద్రీనాథ్. అయితే మేకప్‌ తీయగానే ఆ యుద్ధానికి ప్యాకప్‌ చెప్పేవారు. కానీ ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు పొలిటికల్‌ స్క్రీన్‌పై వార్‌ నడుస్తోంది. లడ్డూ కల్తీ నెయ్యి ఎపిసోడ్‌లో జనసేనాని తన సహజవైఖరికి భిన్నంగా వెళ్లారు. కులంలేదు, మతం లేదు అని ఇంతకాలం చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడు సనాతనధర్మ సారథిగా మారిపోయారు. నేను నా హిందూధర్మం అంటూ పెద్దపెద్ద పదాలు వల్లె వేస్తున్నారు. అప్పట్నుంచే ప్రకాష్‌రాజ్ దాడి మొదలైంది. లడ్డూ కల్తీపై పవన్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ మీరు డిప్యుటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది కాబట్టి విచారణ జరిపించాలని కోరారు. దేశంలో ఇప్పటికే చాలా మతపరమైన ఉద్రిక్తతలున్న సమయంలో లడ్డూ వివాదాన్ని జాతీయం చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ఆ తర్వాత కార్తీ ఎపిసోడ్‌లో నేరుగా పవన్‌ను టార్గెట్‌ చేశారు. చేయని తప్పుకు క్షమాపణలు చెప్పించుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. అక్కడితో ఆగలేదు గెలిచేముందు ఓ అవతారం… ఆ తర్వాత మరో అవతారం అంటూ మరో ఘాటు ట్వీట్ చేశారు. ఆ తర్వాత కూడా పవన్‌పై ట్వీట్ల వర్షం కురిపించారు. వారాహి డిక్లరేషన్‌లో పవన్‌ ఉదయనిధి స్టాలిన్‌ను పరోక్షంగా విమర్శిస్తే .. ప్రకాష్‌రాజ్‌ మాత్రం నేరుగా కౌంటర్లు వేశారు.

నిజానికి పవన్‌పై ప్రకాష్‌రాజ్‌కు వ్యక్తిగత కోపం అంటూ ఏమీ లేదు. ఓ రకంగా వీరిమధ్య మంచి సంబంధాలున్నాయి. అప్పట్లో మా ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్‌కు చిరు ఫ్యామిలీ మద్దతు ఇచ్చింది. తెలుగువాడు కాకపోయినా అండగా నిలిచింది. ఆ తర్వాత కూడా ఆ స్నేహం కొనసాగింది. పవన్ ఇటీవలి ఎన్నికల్లో గెలిచాక కూడా శుభాకాంక్షలు తెలిపారు ప్రకాష్‌రాజ్. కానీ ఈ లడ్డూ ఎపిసోడ్‌లో పవన్ అనుసరించిన తీరు ప్రకాష్‌రాజ్‌కు నచ్చలేదు. పవన్‌ను బీజేపీ ఆడిస్తోందన్నది ప్రకాష్‌రాజ్‌ వాదన. ఈ వాదనలోనూ నిజముంది. గెలవకముందు పవన్‌ తీరు వేరు… మతం, ధర్మం వంటి పదాలు ఆయన నోటివెంట ఎప్పుడూ రాలేదు. మతం లేదని ఓసారి, బాప్టిజం తీసుకున్నానని మరోసారి.. కమ్యూనిస్టు భావజాలం అంటూ ఇంకోసారి… ఇలా రకరకాల ప్రకటనలు చేశారు. కానీ లడ్డూ వివాదం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పుడు ఆయన రూపమే మారిపోయింది. లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పొచ్చు. కానీ ఏకంగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దుర్గగుడి మెట్లు శుభ్రం చేశారు. వారాహి డిక్లరేషన్‌లో తానే ఏకైక సనాతన ధర్మ సారథి అన్నట్లు బిల్డప్‌ ఇచ్చారు. ఆవేశంతో ఊగిపోయారు. హిందూమతం జోలికొస్తే ఊరుకునేది లేదన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామన్నవారికి కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయన్నారు. అసలు మతం లేదన్న పవన్‌ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఎవరూ ఊహించలేదు. అయితే దీనివెనక బీజేపీ వ్యూహం ఉందన్నది చాలామంది నమ్మకం. పవన్‌కు ఉన్న ఇమేజ్‌ను వాడుకుని దక్షిణాదిలో ముఖ్యంగా ఏపీలో బలపడాలన్నది కమలం వ్యూహం. అలాగే డీఎంకేను టార్గెట్ చేయడం ద్వారా తమిళనాడులో హిందువులను తమవైపు తిప్పుకోవాలన్నది బీజేపీ ఆలోచన. తమిళనాడులో బలపడాలని ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నా కమలం ఆశలు నెరవేరడం లేదు. అందుకు ఈసారి పవన్‌ను తెరపైకి తెచ్చింది. పవన్ కూడా బీజేపీ ఏం చెబితే అది చేస్తున్నారు. ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతున్నారు. ఓ రకంగా పవన్‌ను రిమోట్‌తో ఆడిస్తోంది బీజేపీ.

బీజేపీ చేతిలో జనసేనాని కీలుబొమ్మ కావడం ప్రకాష్‌రాజ్‌కు నచ్చలేదు. మొదట్నుంచి ప్రకాష్‌రాజ్‌కు బీజేపీ అంటే పడదు. జస్ట్ ఆస్కింగ్ అంటూ బీజేపీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడేవారు. ఇప్పుడు తన హిట్‌లిస్ట్‌లోకి పవన్‌ను చేర్చారు. ప్రకాష్‌రాజ్‌ ట్వీట్లపై ఆయన మొదట్లో పవన్‌ కూడా కాస్త స్పందించారు. ఆ తర్వాత రియాక్ట్ అవడం మానేసారు. అనవసరంగా వివాదం ఎందుకనుకున్నారో లేక మరీలాగితే ప్రకాష్‌రాజ్‌ ఎక్కడ తన బండారం మరింత బయటపెడతారనుకున్నారో కానీ దానిపై మౌనంగా ఉంటున్నారు. కానీ ప్రకాష్‌రాజ్‌ మాత్రం వదలడం లేదు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా ట్వీట్‌ వదులుతున్నారు. మరి చూడాలి ఈ ఇద్దరి వివాదం ఎందాకా వెళుతుందో…!