Sonia Gandhi: రాజ్యసభకు సోనియా..! 10 జన్‍పథ్‌ను కాపాడుకునేందుకేనా..?

కొంత కాలంగా సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నారు. పలుమార్లు ఆసుపత్రి పాలయ్యారు. సభలు, సమావేశాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా కేవలం ఒక్క సభలోనే పాల్గొన్నారు. తన వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీపై పునరాలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

  • Written By:
  • Publish Date - July 21, 2023 / 05:37 PM IST

Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్లబోతున్నారా..? కర్ణాటక నుంచి పెద్లల సభలో అడుగు పెట్టాలని భావిస్తున్నారా..? రాజ్యసభకు వెళ్లాలన్న ఆలోచన సోనియాకు ఇప్పుడెందుకు వచ్చింది..? ఎంపీ సీటుకు, ఆమె నివాసం 10 జన్‌పథ్‌కు లింకేంటి…?
కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో మూడు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే చేరతాయి. అయితే అందుకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. అయితే ఇప్పట్నుంచే సోనియా.. కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సోనియాను తమ రాష్ట్రం నుంచి రాజ్యసభలో అడుగు పెట్టాల్సిందిగా కోరారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఇటీవల విపక్షాల సమావేశంలో పాల్గొనేందుకు సోనియా బెంగళూరు వచ్చారు. ఆ సమయంలోనే సిద్ధరామయ్య ఈ ప్రపోజల్‌ను ఆమె ముందుంచారు. అయితే దానిపై సోనియా మాత్రం స్పందించలేదు. కానీ సిద్ధరామయ్య ఆఫర్‌ను సోనియా అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
రాజ్యసభకు ఎందుకెళ్లాలి..?
సోనియా ప్రస్తుతం లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు. రాయబరేలి స్థానం నుంచి ఆమె గెలుస్తూ వస్తున్నారు. 2019లోనూ ఆమె అక్కడ 55శాతానికి పైగా ఓట్లను సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీపై కాస్త సందిగ్ధత నెలకొంది. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో ఉన్నారు. పలుమార్లు ఆసుపత్రి పాలయ్యారు. సభలు, సమావేశాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా కేవలం ఒక్క సభలోనే పాల్గొన్నారు. తన వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీపై పునరాలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
10 జన్‌పథ్‌కు లింకేంటి..?
సోనియా ఎన్నికకు, ఆమె నివాసం 10 జన్‌పథ్‌కు లింకుంది. 1989 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజీవ్‌గాంధీ ప్రతిపక్ష నేతగా 10 జన్‌పథ్‌లో ప్రవేశించారు. అప్పటి నుంచి సోనియా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. దేశంలోని అనేక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి ఆ నివాసం. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నో నిర్ణయాలకు అది కేంద్రం. అయితే ప్రస్తుతం ఆ ఇంటిని సోనియా కోల్పోయే ముప్పు పొంచి ఉంది. వచ్చే ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేయకపోతే ఆ ఇంటిని వదులుకోవాల్సిందే. సోనియా తప్పుకుంటే రాయబరేలిలో ప్రియాంకగాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ప్రియాంక గెలిచినా తొలిసారి ఎంపీగా ఆమెకు ఆ నివాసాన్ని కేటాయించే అవకాశాల్లేవు. కాబట్టి ఆ ఇంటిని కాపాడుకోవాలంటే సోనియా ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యురాలిగా ఉండాల్సిందే. ఇటీవల అనర్హత వేటు పడటంతో రాహుల్ గాంధీ తుగ్లక్‌రోడ్‌లోని తన నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. గతేడాది జులైలో లోధీ ఎస్టేట్‌లోని ఇంటిని కూడా ప్రియాంక ఖాళీ చేయాల్సి వచ్చింది. భద్రతా కారణాలతో 1997లో ప్రియాంకకు ఆ నివాసాన్ని కేటాయించారు. అలాంటి పరిస్థితి తనకు రాకూడదని సోనియాగాంధీ భావిస్తున్నారు. నెహ్రూ వంశీయులు ఎవరూ కూడా గత వందేళ్లలో ఢిల్లీలోని ప్రైవేట్ నివాసాల్లో అద్దెకు ఉండలేదు. ఇటీవలే రాహుల్ గాంధీ.. నిజాముద్గీన్ ఈస్ట్‌లోని అద్దె ఇంటికి మారారు. ఎమర్జెన్సీ తర్వాత అధికారాన్ని కోల్పోయిన సమయంలో ఇందిర కూడా తన నివాసాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ సమంయలో ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఫామ్‌హౌస్ ఉన్నా అందులో నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో తన నమ్మినబంటు మహ్మద్ యూనస్ నివాసంలో కొన్నాళ్లు ఉన్నారు.
10 జన్‌పథ్ వెనక కథేంటి..?
ఈ ఇంటిపై చాలా కథలున్నాయి. ఆ నివాసంలో దెయ్యం ఉందన్న ప్రచారం కూడా ఉంది. ఇంట్లో రెండు సమాధులున్నట్లు చెబుతున్నారు. ఇక ఆ ఇల్లు సోనియాగాంధీకి అన్‌లక్కీ అన్న ప్రచారం కూడా ఉంది. అయితే రాజీవ్‌తో కలసి ఉన్న ఆ ఇంట్లోనే ఉండటానికి సోనియా ఇష్టపడ్డారు. నిజానికి ఎమర్జెన్సీ సమయంలో ఆ ఇంటిని యూత్ కాంగ్రెస్ ఆఫీసుగా వినియోగించారు. తర్వాత కొన్నాళ్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆఫీసు నడిచింది. కొన్నాళ్లు బక్సర్ ఎంపీ కెకె.తివారి కూడా అందులో ఉన్నారు. ప్రతిపక్ష నేతగా రాజీవ్‌కు ఆ ఇంటిని కేటాయించారు. ఆ సమయంలో రాజీవ్‌గాంధీని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు వద్దని వారించారట. అయితే ఇంట్లో ఉన్న దెయ్యం.. దేశ రాజకీయాలను చూస్తే పారిపోతుందిలే అని రాజీవ్ జోక్ చేశారు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కొన్ని అనూహ్య ఘటనలు జరిగాయని చెబుతున్నారు. ఆ ఇంట్లో చేరిన రెండేళ్లలోనే రాజీవ్ హత్యకు గురయ్యారు.
సోనియా ఎంపీగా పోటీ చేయకపోతే ఆ ఇల్లు ఉండదు. ప్రైవేట్ నివాసానికి మారాల్సి ఉంటుంది. కానీ రాజీవ్‌తో కలసి తానున్న ఆ ఇంటిని వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే రాజ్యసభకు ఆమె పోటీ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు. ఇందుకు ఇంకా 8 నెలల సమయం ఉంది కాబట్టి ఈ లోపు ఏమైనా పరిణామాలు మారతాయేమో చూడాలి..!