Akhilesh Yadav: అంతుచిక్కని అఖిలేష్ రాజకీయం.. ప్రతిపక్షాల కూటమితోనా..? బీఆర్ఎస్‌తోనా..?

సోమవారం అఖిలేష్ యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్ వచ్చి మరీ, ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని బీఆర్ఎస్, ఎస్పీ నేతలు చెప్పుకొంటున్నా.. దీని వెనుక కచ్చితంగా రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకుల అంచనా. ఇరువురూ ఏ ఉద్దేశంతో భేటీ అయ్యారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది.

  • Written By:
  • Publish Date - July 4, 2023 / 09:12 AM IST

Akhilesh Yadav: దేశ రాజకీయాల్లో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఒకవైపు కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌తో కలిసి ప్రతిపక్షాల కూటమిలో ఉంటూనే.. మరోవైపు ఆ కూటమికి దూరంగా ఉన్న బీఆర్ఎస్‌తో దోస్తీకి ప్రయత్నిస్తున్నారు. దీంతో అసలు అఖిలేష్ యాదవ్ వైఖరి ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

సోమవారం అఖిలేష్ యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్ వచ్చి మరీ, ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని బీఆర్ఎస్, ఎస్పీ నేతలు చెప్పుకొంటున్నా.. దీని వెనుక కచ్చితంగా రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకుల అంచనా. ఇరువురూ ఏ ఉద్దేశంతో భేటీ అయ్యారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవ్వాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌తోపాటు, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీతోపాటు ఎస్పీ కూడా ఈ కూటమిలో ఉంది. ఇటీవల జరిగిన ప్రతిపక్షాల కూటమి సమావేశానికి కూడా ఎస్పీ తరఫున అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ కూటమిలో బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం లేదు. అలాగే ఉత్తర ప్రదేశ్ నుంచి బీఎస్పీ (మాయావతి)కి కూడా చోటు కల్పించలేదు. అంటే ప్రతిపక్షాల కూటమిలో ఉన్న ఎస్పీ.. ఇప్పుడు ఆ కూటమికి దూరంగా ఉంటున్న బీఆర్ఎస్‌తో దోస్తీకి ప్రయత్నించడమే ఆసక్తి కలిగిస్తోంది. ప్రతిపక్షాల కూటమిలో చేరేది లేదని మాయావతి గతంలోనే ప్రకటించారు. కేసీఆర్ ఈ విషయంలో ఏ ప్రకటనా చేయనప్పటికీ.. ఆ కూటమిలో కాంగ్రెస్ ఉన్నందున అందులో చేరడం లేదు.

అసలు ఈ కూటమి తరఫునే ఆయనకు ఆహ్వానం లేదు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌పై పోటీ చేస్తూ, జాతీయ స్థాయిలో దోస్తీ కట్టడం అయ్యే పని కాదు. అలాగని బీజేపీకి కూడా బీఆర్ఎస్ దగ్గరవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ ఈ కూటమికి దూరంగానే ఉండాల్సి వస్తోంది. ఎస్పీ మినహా పార్టీలేవీ బీఆర్ఎస్‌ను పట్టించుకోవడం లేదు. అయితే, విచిత్రంగా ఆ కూటమికి చెందిన అఖిలేష్ మాత్రం పనిగట్టుకుని బీఆర్ఎస్‌ కోసం తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ ఎటువైపు వెళ్తారనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ప్రతిపక్షాల కూటమిలో చేరాలి అని బీఆర్ఎస్‌ను ఆహ్వానించారా అనే మరో చర్చ కూడా నడుస్తోంది. అలా కాకుండా కేసీఆర్ ప్రభావంతో అఖిలేష‌ ప్రతిపక్షాల కూటమికి దూరమైతే.. అది ప్రతిపక్షాలకు పెద్ద దెబ్బే.
ఫలించని బీఆర్ఎస్ ఆశలు
మరోవైపు జాతీయ స్థాయిలో సత్తా చాటాలని బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గతంలో పలు పార్టీలతో సమావేశం జరిపినా ఏ పార్టీ మద్దతివ్వలేదు. పంజాబ్, బిహార్ వెళ్లి అక్కడి ప్రభుత్వాల్ని కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. కర్ణాటకలో జేడీఎస్‌ కూడా దూరంగానే ఉంది. మహారాష్ట్రలోనూ ఒంటరిగానే ప్రయత్నిస్తోంది. ఏ పార్టీ కూడా బీఆర్ఎస్‌కు దగ్గరయ్యేందుకు ఇష్టపడటం లేదు. ఈ పరిస్థితిలో ఒక్క ఎస్పీ మాత్రం ఎందుకో కేసీఆర్‌తో చర్చలు జరుపుతోంది. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని కేసీఆర్ చెప్పుకొంటున్నా.. అంత సీన్ లేదని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది.