సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసులో కర్నూలు డీఐజీ, ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. అసభ్యకర పోస్టుల కేసు నిందితులు వర్రా రవీందర్రెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు… ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. నిందితులు వాడిన భాష అసభ్యకరంగా ఉందన్నారు. అరబ్ దేశాల్లో అయితే తీవ్ర శిక్షలు ఉంటాయని… సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబాలపై తీవ్రమైన దూషణలు వాడారని పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలించామని తెలిపారు.
నిన్న మార్కాపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. వర్రా రవీందర్రెడ్డి గతంలో భారతి సిమెంట్‌లో పనిచేశాడని మరో ఇద్దరు కూడా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారన్నారు. డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులను వైసీపీకి అనుకూలంగా వినియోగించుకున్నారని చెప్పారని జడ్జిలకు వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. మహిళా కుటుంబసభ్యులు, వారి పిల్లలపై పోస్టులు పెట్టారన్నారు. పోస్టులు పెట్టేవారిని ఇప్పటివరకు 45 మందిని గుర్తించామన్నారు.
నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వివరించారు. నాయకుల ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టేవారన్నారు. నిందితులకు 40 యూ ట్యూబ్ ఛానళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. యూ ట్యూబ్ ఛానళ్ల ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారని పేర్కొన్నారు. తాడేపల్లిలోని కార్యాలయం నుంచి ఇవన్నీ నడిపేవారని తెలిపారు. జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో వీరంతా పనిచేసేవారన్నారు. తాడేపల్లిలోని పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచే పోస్టులు పెట్టేవారని పేర్కొన్నారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉందన్నారు. నిందితులు పెట్టిన పోస్టులను సాధారణంగా చదవలేమన్నారు. సభ్యసమాజం అసహ్యించుకునేలా వారి పోస్టులు ఉన్నాయన్నారు. మహిళలపై ఇలాంటి పోస్టులు పెట్టినవారు రాక్షసజాతికి చెందినవారుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతల మనోధైర్యం చంపడమే లక్ష్యంగా పోస్టులు పెట్టారని వివరించారు.