SPEAKER ELECTION: తెలంగాణ అసెంబ్లీలో 18 మంది తప్ప మిగిలిన ఎమ్మెల్యేలంతా ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ముందు మొదటి రోజు ప్రమాణం చేశారు. ఇక స్పీకర్ ఎన్నిక కోసం కసరత్తు మొదలైంది. సోమవారం నాడు స్పీకర్ ఎన్నికల కోసం బులెటిన్ రిలీజ్ అవుతుంది. నామినేషన్లకు రెండు రోజుల గడువు ఉంటుంది. ఈ నెల 14న తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 15నాడు అసెంబ్లీ కొత్త స్పీకర్‌ను ఎన్నికుంటారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించింది.
కాంగ్రెస్ తరపున ఆయన నామినేషన్ వేయబోతున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా తమ అభ్యర్థిని నిలబెడతాయా.. పోటీకి పెట్టే ఆలోచన బీఆర్ఎస్ చేస్తుందా.. చేస్తే గెలుస్తారా..? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. 64 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మిత్రపక్షం సీపీఐతో కలిపి 65 మంది. అందువల్ల కాంగ్రెస్ కు చెందిన వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికవడం లాంఛనమే. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కి సభలో 39 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే స్పీకర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నిలబెట్టినా బీజేపీ, ఎంఐఎం మద్దతు ఇచ్చే అవకాశం లేదు. తమ అభ్యర్థిని నిలబెడతామన్న ఆలోచన అయితే గులాబీ పార్టీ చేసే ఛాన్స్ లేదు. ఈ పరిస్థితుల్లో గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజున ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. తర్వాత మంత్రుల ప్రమాణం సాగింది. అయితే ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. నిబంధనల ప్రకారం వాళ్ళు లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి.
వారు ఇంకా రిజైన్ చేయలేదు. ఢిల్లీకి వెళ్లి లోక్ సభ స్పీకర్ కు రాజీనామా లేఖలు ఇచ్చిన తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఉంది. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ను నియమించినందుకు నిరసనగా బీజేపీకి చెందిన 8 మంది సభ్యులు ప్రమాణం చేయలేదు. పూర్తి స్థాయి స్పీకర్ వచ్చాకే చేస్తామన్నారు. కేసీఆర్ అనారోగ్యం కారణంగా కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ప్రమాణం చేయలేదు. వీరు కాకుండా కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్, టి.పద్మారావు గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయలేదు. సభ్యుల ప్రమాణం తర్వాత అసెంబ్లీ సమావేశాలను ప్రొటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఈ నెల 14కి వాయిదా వేశారు. 15న గురువారం స్పీకర్ ఎన్నిక తర్వాత శుక్రవారం రోజున అసెంబ్లీ, మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి.. గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. శనివారం రోజు గవర్నర్ స్పీచ్ కు ధన్యవాదాలు తీర్మానం..తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఉంటాయి.